Yogandhra 2025: అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం
Yogandhra 2025 : విశాఖ వేదికగా శనివారం జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైయింది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పాల్గొంటున్న ఈ కార్యక్రమానికి విశాఖ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. యోగాంధ్ర పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కోసం ఆర్కే బీచ్ నుండి భీమిలి బీచ్ వరకు 26 కిలోమీటర్ల పొడవునా, అన్ని వసతులతో కూడిన మొత్తం 326 కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేసారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుండి సుమారు ఐదు లక్షల మందిని ఈ యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములు చేసే విధంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసారు. అర్ధరాత్రి నుండి ఉత్తరాంధ్ర జిల్లాల నుండి ప్రత్యేక బస్సులలో… ఆర్.కే.బీచ్ లోని తమకు కేటాయించిన కంపార్ట్మెంట్లకు చేరుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసారు.
రాష్ట్రంలో మే 21న యోగాంధ్ర (Yogandhra 2025) కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సామాన్యుల చెంతకు దరిచేర్చడమే లక్ష్యంగా నెల రోజులపాటు వివిధ వర్గాల ప్రజల భాగస్వామ్యంతో యోగా శిక్షణ పూర్తయ్యింది. యోగాంధ్ర చివరిరోజు కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ప్రదేశాల్లో యోగా ప్రదర్శన జరుగుతుంది. దీనిలో భాగంగా విశాఖపట్నం సముద్ర తీరంలో గిన్నిస్ రికార్డు సాధనే లక్ష్యంగా సుమారు 5 లక్షలమందితో శనివారం యోగా ప్రదర్శన నిర్వహించేందుకు ప్రభుత్వం యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మెగా కార్యక్రమంలో మన ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi), ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రముఖులు, ఉత్తరాంద్ర జిల్లాల నుంచి తరలివచ్చే జనమంతా భాగస్వాములు కానున్నారు.
Yogandhra 2025 – ప్రదర్శనకు భారీ ఏర్పాట్లు
విశాఖ (Vizag) సముద్ర తీరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ (Yogandhra 2025) కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. బీచ్‌రోడ్డులోని కాళీమాత ఆలయం నుంచి భీమునిపట్టణం వరకు మొత్తం 26 కిలోమీటర్ల మేర యోగాభ్యాస ప్రదర్శనను నిర్వహిస్తారు. దీనికోసం మొత్తం 326 కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేశారు. ఒక్కో కంపార్ట్మెంట్ కు గెజిటెడ్ స్థాయి అధికారిని ఇన్ ఛార్జిగా నియమించారు. ప్రతీ కంపార్ట్మెంట్లో యోగా శిక్షకులు, ముగ్గురు ప్రదర్శకులు, పదిమంది వాలంటీర్లు, ఒక ఏఎన్ఎం, ఆశా వర్కర్, పోలీసు అధికారి, గిన్నీస్ రికార్డు నమోదు కోసం కంపార్ట్మెంట్ కు 10 మంది చొప్పున మొత్తం 4,600 మంది ప్రతినిధులు, ఫుడ్ ఇన్‌ఛార్జి ఒకరు, ఇద్దరు సూపర్వైజర్లు, పారిశుధ్య పర్యవేక్షకులు, నలుగురు పారిశుధ్య పనివారు ఉంటారు. యోగా ప్రదర్శకులు 1,438 మంది, శిక్షకులు 907 మంది ఈ కంపార్ట్మెంట్లలో సిద్దంగా ఉంటారు. మొత్తం 4,280 మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. ముందుజాగ్రత్త చర్యగా 35 మంది పాములు పట్టేవారితో పాటు పెద్ద సంఖ్యలో గజ ఈతగాళ్లను సిద్దం చేశారు. పర్యవేక్షణకు డిప్యుటీ కలెక్టర్లతో పాటు, అఖిల భారత అధికారులు సైతం బాధ్యత తీసుకున్నారు.
ప్రతీ కంపార్ట్మెంట్లో తాగునీరు, 100 మందికి ఒకటి చొప్పున మరుగుదొడ్లు, స్టెచర్, ఫస్ట్ ఎయిడ్ కిట్, స్నాక్స్ బాక్సులు సిద్దంగా ఉంటాయి. ప్రదర్శనలో పాల్గొనే ప్రతీ ఒక్కరికీ యోగా మేట్, టి షర్ట్ పంపిణీ చేస్తారు. యోగా ప్రదర్శన అనంతరం సాధనకులు వీటిని తీసుకువెళ్లిపోవచ్చు. కంపార్ట్మెంట్లో ప్రవేశించడానికి, బయటకు వెళ్లేందుకు వేర్వేరు మార్గాలను ఏర్పాటు చేశారు. అందరికీ కనిపించే విధంగా ఎల్ఈడి స్క్రీన్లు, సౌండ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. కొన్ని ప్రదేశాల్లో విష పురుగులు చేరకుండా మూడుసార్లు క్రిమిసంహారక మందులను పిచికారీ చేసి, కంపార్ట్మెంట్లను సిద్దం చేశారు. అవసరమైన అత్యవసర మందులు, 104 వాహనాలతో పాటు ప్రతీ ఐదు కిలోమీటర్లకు ఒక 5 పడకల ఆసుపత్రిని సిద్దం చేశారు.
మొత్తం 326 వైఫై పాయింట్స్, 335 ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అధికారులను, ప్రజలను వేదికల వద్దకు తరలించడానికి మొత్తం 9,995 వాహనాలను వినియోగిస్తున్నారు. వీటిలో 7,295 బస్సులు, 2,500 ఆటోలు, 200 మేక్సీ క్యాబ్‌లు ఉన్నాయి. మొత్తం 75 పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. అభ్యాసకులను ఏ కంపార్ట్మెంట్ వద్ద దించారో, అక్కడే వారిని తిరిగి వాహనంలోకి ఎక్కించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రతీ కంపార్ట్‌మెంట్‌కు బస్సులను సైతం మ్యాపింగ్ చేశారు. మొత్తం 10,000 మంది పోలీసులు అధికారులు, సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు.
18 క్రీడా మైదానాల్లో ప్రదర్శనలు
మొత్తం 26 కిలోమీటర్ల సాగర తీరంతో పాటుగా మరో 18 క్రీడా మైదానాల్లో కూడా యోగా ప్రదర్శనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏయూ మైదానం, చినగదిలి గోల్ఫ్ క్లబ్, పిఎం పాలెం క్రికెట్ స్టేడియం, కొమ్మాది స్టేడియం, ఫోర్ట్ స్టేడియం, రైల్వే ఎగ్జిబిషన్ గ్రౌండ్, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం తదితర 18 క్రీడా మైదానాలు, మరో 30 అదనపు ప్రాంతాల్లో కూడా యోగా ప్రదర్శనలు నిర్వహిస్తారు.
Also Read : PM Narendra Modi: విశాఖ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
