Visakhapatnam Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ లో 900 మంది కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ?
విశాఖ స్టీల్ ప్లాంట్ లో 900 మంది కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ?
Visakhapatnam Steel Plant : విశాఖ ఉక్కు… ఆంధ్రుల హక్కు అంటూ పోరాడి సాధించిన విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత స్టీల్ ప్లాంట్(Visakhapatnam Steel Plant) ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం కాస్త వెనకడుగు వేసినట్లు కనిపిస్తుంది. అంతేకాదు స్టీల్ ప్లాంట్ ను లాభాల బాట పట్టించడానికి ప్రత్యేక ప్యాకేజీను ప్రకటించింది. అయితే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇటీవల భారీగా కాంట్రాక్టు కార్మికులను తొలగించడం… స్టీల్ ప్లాంట్ ఉనికిని ప్రశ్నార్ధకం చేస్తుంది. ఇటీవల కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కార్మికులను భారీగా తొలగించారు. సుమారు 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించింది. దీనితో ఏ క్షణమైనా సమ్మెకు దిగడానికి కాంట్రాక్ట్ కార్మికులు సిద్ధమౌతున్నారు.
Visakhapatnam Steel Plant Layoffs
మరోవైపు భారీ ఆందోళనకు అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఇప్పటికే సమ్మె నోటీసు గడువు ముగిసింది. స్థానిక ప్రజా ప్రతినిధులపై కార్మికులు మండిపడుతున్నారు. ఇది ఇలా ఉండగా స్టీల్ సీఐటీయూ గౌరవాధ్యక్షుడు జె.అయోధ్యరామ్‌కు ఇచ్చిన షోకాజ్ నోటీసును తక్షణం ఉపసంహరించుకోవాలని జిల్లా అధ్యక్షుడు ఎన్.రామారావు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. అయోధ్యరామ్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉక్కు పరిపాలన భవనం వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని ప్రభావితం చేసే విధంగా కార్మిక సంఘాల ప్రతినిధులపై ఉక్కు యాజమాన్యం కుట్రలు చేస్తోందన్నారు. కర్మాగారంలో నేటి వరకు ఉన్న ప్రతి ప్రయోజనం పోరాటాల ద్వారానే సాధించుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. పోరాటంలో అనైక్యతను సృష్టించడం కోసం ప్రభుత్వం, యాజమాన్యాలు ఎంత ప్రయత్నించినా… స్టీల్ కార్మికులు మరింత ఐక్యంగా ముందుకు సాగుతారన్నారు. గుర్తింపు యూనియన్ ప్రధాన కార్యదర్శి డి.ఆదినారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ ద్వారా స్టీల్ పరిశ్రమలో సమస్యలు పరిష్కారం కావని ఆయన వివరించారు. సస్పెన్షన్లు, షోకాజ్ నోటీసులతో కార్మి ఉద్యమాన్ని అణచలేరన్నారు. వెంటనే యాజమాన్యం నోటీసును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read : Car Accident: ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాల్వలోనికి దూసుకెళ్లిన కారు ! ముగ్గురు మృతి !