Vital BJP : సిట్ కాదు జడ్జితో విచారణ చేపట్టాలి
టీఎస్పీఎస్సీ లీక్ పై విఠల్ కామెంట్స్
Vital BJP : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) లో చోటు చేసుకున్న పేపర్ లీక్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. రాష్ట్ర వ్యాప్తంగా గందర గోళం నెలకొంది. ఈ కేసుకు సంబంధించి మొత్తం 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని కోర్టులో హాజరు పరిచారు. ఈ మొత్తం ఘటనపై తీవ్రంగా స్పందించారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ టీఎస్ పీఎస్సీ సభ్యుడు విఠల్(Vital BJP). ఆయన సంచలన కామెంట్స్ చేశారు. దీని వెనుక ఎవరు ఉన్నారో తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
గతంలో ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయని ఇందుకు సంబంధించి ఏర్పాటు చేసిన సిట్ ల వల్ల ఏమీ కాలేదన్నారు. అసలు చైర్మన్ కు తెలియకుండా పేపర్ లీక్ అయ్యే అవకాశమే లేదని కుండ బద్దలు కొట్టారు. కార్యదర్శికి కూడా సంబంధం ఉండదన్నారు. ఇది పూర్తిగా రాజ్యాంగ బద్దమైన సంస్థ అని, ఇంత పెద్ద ఎత్తున పేపర్ లీక్ అయితే టీఎస్ పీఎస్సీ చైర్మన్ బి. జనార్దన్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా ఉన్న రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్ లు ఎలా సంస్థలోకి వచ్చారనేది తేలాలన్నారు. వీరి వెనుక ఎవరి హస్తం ఉందో బయట పెట్టాలన్నారు. అసలు నిజాలు వెలుగు చూడాలంటే సిట్ తో కాకుండా సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని తెలంగాణ విఠల్(Vital BJP) డిమాండ్ చేశారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎంతో మంది మేధావులతో మీటింగ్ నిర్వహించి కీలక సంస్కరణలు తీసుకు వచ్చామని అన్నారు. ఈ మొత్తానికి బాధ్యత వహించాల్సింది జనార్దన్ రెడ్డి అని ఆరోపించారు.
Also Read : రాజీనామా చేస్తా రాజీ పడను