Waqf Bill: వక్ఫ్ బిల్లుకు ఆమోదముద్ర వేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
వక్ఫ్ బిల్లుకు ఆమోదముద్ర వేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
Waqf Bill : వక్ఫ్ (సవరణ) బిల్లు-2025కు, ముసల్మాన్ వక్ఫ్ (ఉపసంహరణ) బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Murmu) శనివారం ఆమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ శనివారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. ఈ రెండు బిల్లులకు పార్లమెంటు ఉభయ సభలు విడివిడిగా సమ్మతి తెలిపిన విషయం తెలిసింది. వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం… యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్ ఎంపవర్‌మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్‌మెంట్ (ఉమీద్-యుఎంఈఈడీ) బిల్లుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఆమోద ముద్రతో ఉమీద్ చట్టంగా మారింది.
Waqf Bill Updates
కాగా వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 రాజ్యాంగ చట్టబద్ధతను సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో మరో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్, పౌర హక్కుల పరిరక్షణ సంస్థ తరఫున వీటిని దాఖలు చేశారు. వక్ఫ్ బిల్లులోని(Waqf Bill) పలు నిబంధనలను వ్యతిరేకిస్తూ ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావెద్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఇదిలా ఉండగా, వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింలపై దాడేనని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ శనివారం అన్నారు. భవిష్యత్‌లో దేశంలో ఇతర మతాలపై జరగనున్న దాడులకు ఇదో ఉదాహరణ వంటిదని పేర్కొన్నారు. వక్ఫ్ బిల్లు ఆమోదం తర్వాత ఆర్‌ఎస్ఎస్ క్యాథలిక్ చర్చి భూములపై దృష్టి సారించిందని పేర్కొంటూ ఆరెస్సెస్ అనుబంధ పత్రికలో వచ్చిన ఒక వార్తా కథనాన్ని దానికి జోడించారు. ఇక క్రిస్టియన్లపై దృష్టి సారించడానికి ఆర్‌ఎస్ఎస్ కు ఎంతో సమయం పట్టదని రాహుల్ తన పోస్టులో వివరించారు.
ఇటీవల ఈ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. వక్ఫ్ బిల్లుపై బుధవారం లోక్‌సభలో 14 గంటలకు పైగా చర్చ జరిగింది. అనంతరం సవరణల వారీగా ఓటింగ్ ప్రక్రియ నిర్వహించగా.. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటేశారు. రాజ్యసభలో బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటేశారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని, ఏ ఒక్కరి మత విశ్వాసాలను దెబ్బతీయటం ప్రభుత్వం ఉద్దేశం కాదని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
Also Read : Ramatheertham: సీతారామ కళ్యాణం కోసం ముస్తాబైన ఉత్తరాంధ్ర భద్రాద్రి రామతీర్థం