Watchman Ranganna: వాచ్‌మెన్‌ రంగన్న మృతిపై ఆయన భార్య షాకింగ్ కామెంట్స్

వాచ్‌మెన్‌ రంగన్న మృతిపై ఆయన భార్య షాకింగ్ కామెంట్స్

Watchman Ranganna : మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న వాచ్‌మెన్‌ రంగన్న(Watchman Ranganna) మృతిపై ఆయన భార్య సుశీలమ్మ సంచలన వ్యాఖ్యలు చేసారు. రంగన్న మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ… పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేసిన సుశీలమ్మ… ఈ సందర్భంగా షాకింగ్ విషయాలు బయటపెట్టింది. తన భర్త రంగన్న మృతికి పోలీసులు, సీబీఐ వేధింపులే కారణమని సంచలన ఆరోపణలు చేసింది. తప్పుచే‌సింది ఒకళ్లు… శిక్ష తన భర్త రంగన్నకు వేశారని ఆమె కన్నీరు పెట్టుకుంది. గత ఆరేళ్లుగా పోలీసులు తమ ఇంటి ముందు కాపలా ఉన్నారని తెలిపింది. పోలీసులు సరైన సమయంలో వైద్యంచేయించలేదని… మూడు నెలల నుంచి తన భర్త మంచాన పడ్డారని చెప్పింది. అప్పట్లో తప్పు చేసిన వారిని పట్టుకోకుండా తన భర్తను పట్టుకుని వేధించారని రంగన్న భార్య సుశీలమ్మ వాపోయింది.

Watchman Ranganna Death

గత కొంతకాలంగా ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధులతో కొంతకాలంగా బాధపడుతున్న రంగన్న రెండు వారాల క్రితం కిందపడ్డారు. అప్పుడు కాలికి గాయమైంది. అప్పటి నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ పులివెందులలోని ఇంటి వద్దే ఉంటున్నారు. బుధవారం మధ్యాహ్నం ఊపిరాడటం లేదని తెలపడంతో కుటుంబ సభ్యులు, రక్షణగా ఉన్న కానిస్టేబుల్‌ కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ సాయంత్రం మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

వివేకా హత్య(YS Viveka) కేసులో రంగన్న కీలక సాక్షి కావడంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ కేసుపై విచారణాధికారిగా సీఐ ఉలసయ్యను అధికారులు నియమించారు. ఈ క్రమంలో రంగన్న మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ ఆయన భార్య ఫిర్యాదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు రంగన్న మృతదేహానికి గురువారం రిమ్స్‌లో పోస్టుమార్టం నిర్వహించారు. రంగన్న అనారోగ్యంతో మృతి చెందినప్పటికీ సీబీఐ, పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రంగన్న మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. గతంలో సాక్షుల మృతి అనుమానస్పదం కావడంతో… రంగన్న మృతదేహానికి పోస్టుమార్టం చేయాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పులివెందులలోని తన నివాసంలో 2019 మార్చి 15వ తేదీన దారుణ హత్యకు గురయ్యారు. అప్పట్లో ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా కలిగించింది. ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగన్న మృతిచెందారు. అయితే రంగన్న మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని ఆయన భార్య తెలిపింది.

Also Read : Daggubati Venkateswara Rao: దగ్గుబాటి రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకం ఆవిష్కరించిన చంద్రబాబు

Leave A Reply

Your Email Id will not be published!