Amit Shah: 2026 మార్చి నాటికి మావోయిస్టులు అంతం చేస్తాం – హోంమంత్రి అమిత్ షా
2026 మార్చి నాటికి మావోయిస్టులు అంతం చేస్తాం - హోంమంత్రి అమిత్ షా
Amit Shah: మావోయిస్టులు హింసను, ఆయుధాలను వదిలేసి లొంగిపోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. లేకుంటే ఆపరేషన్ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టుల దాడులు పెరిగిపోతున్నాయి. ఈనేపథ్యంలో 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజం తుడిచిపెట్టుకుపోతుందని కేంద్ర హోమంత్రి అమిత్ షా(Amit Shah) పేర్కొన్నారు. హింసను వీడి లొంగిపోవాలని మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ హింసాకాండలో 55 మంది బాధితులను ఉద్దేశించి ఆయన శుక్రవారం ఈమేరకు వ్యాఖ్యానించారు.
Amit Shah Comment
దేశంలో మావోయిస్టుల హింస, భావజాలాన్ని నిర్మూలించి శాంతిని నెలకొల్పాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించుకున్నారని అమిత్‌షా పేర్కొన్నారు. మావోయిస్టులు ఒకప్పుడు పశుపతినాథ్ నుంచి తిరుపతి వరకు కారిడార్ ఏర్పాటుచేయాలని భావించారని కానీ, మోదీ నేతృత్వంలో దాన్ని ధ్వంసం చేశామన్నారు. ఈసందర్భంగా హింసను, ఆయుధాలను వదిలేసి లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే మావోయిస్టుల అంతానికి ఆల్- అవుట్ ఆపరేషన్ నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఛత్తీస్‌గఢ్‌లోని నాలుగు జిల్లాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా జరిపిన ఆపరేషన్లలో భద్రతా బలగాలు గణనీయమైన విజయాన్ని సాధించారన్నారు.
ఇక, రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో మావోయిస్టుల హింసాకాండ బాధితులకు హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ త్వరలో సంక్షేమ పథకాన్ని రూపొందిస్తుందన్నారు. ఉద్యోగాలు, ఆరోగ్య సంరక్షణతో పాటు సంక్షేమ కార్యక్రమాల ద్వారా బాధితులకు సహాయం అందిస్తామని షా వెల్లడించారు.