West Bengal Teachers: పశ్చిమ బెంగాల్ లో రోడ్డెక్కిన మాజీ ఉపాధ్యాయులు
పశ్చిమ బెంగాల్ లో రోడ్డెక్కిన మాజీ ఉపాధ్యాయులు
West Bengal Teachers : పశ్చిమ బెంగాల్ రాజకీయాలను కుదిపేసిన ఉపాధ్యాయ నియామక కుంభకోణం వ్యవహారంలో కీలకపరిణామం చోటు చేసుకుంది. సుప్రీకోర్టు(Supreme Court) ఆదేశాలతో ఉద్యోగాలు కోల్పోయిన ఉపాధ్యాయులు… రోడ్డెక్కారు. తమ ఉద్యోగాలు తమకు ఇవ్వాల్సిందేనంటూ పశ్చిమబెంగాల్(West Bengal) సీల్దా, సెంట్రల్ అవెన్యూ ప్రాంతాల్లో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జోగ్యో శిక్షక్ మంచ్ (అర్హత గల ఉపాధ్యాయుల ఫోరం) ప్రతినిధి మెహబూబ్ మండల్ మాట్లాడుతూ… ‘పరీక్షలో మంచి స్కోరు సాధించినా, నియామకాల్లో జరిగిన అవినీతి వల్ల మేం అర్హులమే అయినప్పటికీ ఉద్యోగాలు పోయాయి ఇది మా తప్పా?’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, మా ఉద్యోగం మాకు తిరిగి ఇవ్వండి. లేదంటే అర్హులు, అవినీతి పరుల్ని గుర్తించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు.
West Bengal Teachers Protest Update
అయితే ధర్నా చేస్తున్న ఆందోళనకారులపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. కొంతమందిపై విచక్షపోలీసుల దాడి చేసారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో… పోలీసుల దాడి, లాఠీఛార్జీపై ఆందోళన కారులు మాట్లాడుతూ… ప్రజాస్వామ్యంలో మేము శాంతియుతంగా నిరసన తెలపలేకపోతే, న్యాయం కోసం మేము ఎవరి దగ్గరకు వెళ్లాలి? అని ప్రశ్నించారు. అవినీతికి శిక్ష, న్యాయానికి గౌరవం దక్కాలన్నదే మా డిమాండ్. త్వరలో మరింత మంది అర్హులైన ఉపాధ్యాయులతో సంప్రదింపులు జరపనున్నాం. ఆ తర్వాత భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు.
పశ్చిమబెంగాల్(West Bengal) స్కూల్ సర్వీస్ కమిషన్(డబ్ల్యూబీఎస్‌ఎస్‌సీ) ద్వారా 2016లో నిర్వహించిన టీచర్ల , బోధనేతర సిబ్బంది నియామకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని సీబీఐ విచారణలో తేటతెల్లం కావడంతో… ఆ నియామకాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. మొత్తం 25,753 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాల్లో అవకతవకలను, లోపాలను ఉద్దేశపూర్వకంగానే కప్పిపుచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ… మొత్తం నియామకాలు చెల్లవని తీర్పు వెలువరించింది. మళ్లీ నియామకాలు చేపట్టాలని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌ల ధర్మాసనం ఆదేశించింది. దీనితో సుప్రీంకోర్టు తీర్పుతో ఉద్యోగాలు కోల్పోయిన ఉపాధ్యాయులు ఒక్కొక్కరుగా రోడ్డెక్కుతున్నారు.
ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో 9 నుంచి 12 తరగతులకు ఉపాధ్యాయులతో పాటు గ్రూప్ సి, గ్రూప్ డి స్టాఫ్ సిబ్బంది నియామకాల కోసం 2016లో బెంగాల్ సర్కారు రాష్ట్ర స్థాయి సెలక్షన్ పరీక్ష నిర్వహించింది. 24,650 ఖాళీల భర్తీ కోసం చేపట్టిన ఈ రిక్రూట్‌మెంట్ పరీక్షకు 23 లక్షల మందికి పైగా హాజరయ్యారు. అనంతరం ఇందులో ఎంపిక ప్రక్రియ చేపట్టి 25,753 మందికి అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేశారు. అయితే, ఖాళీలు ఉన్న సంఖ్య కంటే ఎక్కువ మందిని ఎంపిక చేయడంపై వివాదం రాజుకుంది. ఉద్దేశపూర్వకంగానే అదనపు పోస్టులను సృష్టించి అక్రమ నియామకాలు చేపట్టారని ఆరోపణలు వచ్చాయి.
దీనిపై విచారణ జరిపిన కలకత్తా హైకోర్టు 2016 నాటి ఆ నియామక ప్రక్రియ చెల్లదని తీర్పు వెలువరించింది. అంతేగాక, ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పాత్రతో పాటు అవకతవకలపై దర్యాప్తు జరపాలని సీబీఐని ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై గతంలో విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం… సీబీఐ దర్యాప్తుపై స్టే విధించింది. తాజాగా అదనపు ఉద్యోగాల సృష్టిపై దర్యాప్తు అవసరం లేదంటూ తీర్పు వెలువరించింది. ఇప్పటికే 25,753 మంది టీచర్ల నియామకాలు చెల్లవని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
Also Read : President Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు స్లొవేకియా వర్సిటీ గౌరవ డాక్టరేట్
