#ArtistSrikanth : రంగుల‌కు వ‌న్నెలు అద్దుతున్న శ్రీ‌కాంత్

జీవితాన్ని ఆవిష్క‌రించే సాధ‌నాల్లో క‌ళ ఒక‌టి

Artist Srikanth : జీవితం కొందరికి బోర్. ఇంకొందరికి ఎంజాయ్. మరికొందరికి మాత్రం అదో సరదా కానే కాదు. ఓ యుద్ధం. అందులో ఎన్నో కళలు. బతుకును అర్థం చేసుకోవాలన్నా, దానిని కుంచెలో బంధించాలంటే చాలా ఓర్పు కావాలి. అంతకంటే ఎక్కువగా సహనం ఉండాలి. ప్రతి ప్రయాణం ఒక్కో అనుభవాన్ని..అనుభూతిని మిగిల్చేలా చేస్తుంది. అందులో ఆర్టిస్టులు వెరీ వెరీ డిఫ్ఫరెంట్. ఎవరి లోకంలో వాళ్ళు మునిగి పోతే కళాకారులు మాత్రం తమ లోకంలో తాము జీవిస్తారు. తమ మెదళ్ళకు పనిచెబుతారు. అది కవితైనా..పాటైనా..చిత్రమైనా..దృశ్యమైనా..ఏదైనా ప్రాణం పోసు కోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఒక్కోసారి పురిటి నొప్పులలాంటి కష్టం కూడా. అందుకే చాలా మంది కళాకారులు ఎవ్వరికీ త్వరగా అర్థం కారు. ఎవ్వరూ వారి ప్రపంచంలోకి వెళ్ళలేరు. ఇది కొన్ని తరాలుగా, కొన్నేళ్లుగా అనాది నుంచి వస్తూనే ఉన్నది.

కుంచె చేతిలోకి ఒదిగి పోతే కొత్త గా ఓ అద్భుత దృశ్యం కాగితంపై రూపు దిద్దు కుంటుంది. అందులో ఎన్నో కలర్స్. ప్రతి రంగు ఒక్కో అర్థాన్ని ఇస్తూ ఉంటుంది. అందుకే రంగుల హరివిల్లును ఆవిష్కరించాలని ఆర్టిస్టులు ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఈ సంచారపు ప్రవాహంలో వేలాది మంది కొట్టుకు పోతే కొందరు మాత్రమే కళాకారులుగా మిగిలి పోతారు. తమను తాము ప్రూవ్ చేసు కోవాలంటే రేయింబవళ్లు కష్ట పడాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో ఓ వైపు వృత్తి రీత్యా వత్తిళ్లు ఉన్నప్పటికీ ప్రవుత్తి రీత్యా కళాకారుడిగా రాణిస్తున్నాడు పాలమూరు జిల్లా కొత్తకోటకు చెందిన మంజులపుత్ర శ్రీకాంత్ ఆచారి(Artist Srikanth ). అన్న రమేష్ రాజా కూడా పేరు మోసిన చిత్రకారుడు. చూస్తే చాలు చిత్రాన్ని గీసే నైపుణ్యం కలిగిన శ్రీకాంత్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు..బెస్ట్ డిజైనర్ కూడా.

గతంలో ఎన్నో ఇబ్బందులు ఉండేవి. కానీ ఇప్పుడు ఆర్టిస్టులకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా డిజైనింగ్ లో శిక్షణ పొందితే బావుంటుంది అంటాడు శ్రీకాంత్(Artist Srikanth ). ప్రస్తుతం ఈ ఆర్టిస్ట్ అసోసియేట్ గా అమెజాన్ లో జాబ్ చేస్తున్నా..లైఫ్ లో ఏదో స్పెషాలిటీ ఉండాలిగా ..అందుకే ఏ కొద్ది సమయం వీలు చిక్కినా పెయింటింగ్స్ వేయడంలో లీనమై పోతాడు. అంతే కాదు నిమిషాల్లోపే మనం ఏది కోరితే అది వెంటనే గీసి మన చేతుల్లో పెట్టడం శ్రీకాంత్ కు వెన్నతో పెట్టిన విద్య. అంతే కాదు క్షణాల్లో అందమైన ఆలోచనలకు రెక్కలు తొడిగి ..వాటికి సంగీతం జోడించి వీడియోలు కూడా రూపొందించడంలో ఎక్స్ పర్ట్. కళ జీవితాన్ని ప్రతిఫలించేలా చేయడంలో దోహదకారిగా ఉంటుంది. మాటలు గాయ పరుస్తాయి. గుండెల్ని వెంటాడుతాయి. కానీ వేల పదాలు చెప్పలేని భావాలను పలికించే గొప్ప సాధనం చిత్రం.

అదే పెయింటింగ్. ప్రకృతితో మమేకం కావడం..ప్రయాణం చేయడం..సాహిత్యం..సంగీతం…లోకం ఇవ్వన్నీ ప్రేరణగా నిలుస్తాయి. ప్రతి సన్నివేశం ప్రభావం చూపుతూనే ఉంటుంది. సాధారణమైన వ్యక్తులకు పరమ బోర్ అనిపిస్తుంది..కానీ మాలాంటి ఆర్టిస్టులకు అదో ప్రేరణ అంటాడు శ్రీకాంత్(Artist Srikanth ). రంగులు..కుంచెలు..బొమ్మలు ఇవి లేకుండా నేనుండలేనంటాడు. ఆలోచనల్ని కలగలిపి కుంచెతో చిత్రాల్ని అందంగా గీస్తాడు. ప్రతి జీవిలో ఓ ఆర్టిస్ట్ దాగి ఉంటాడు. ప్రయత్నం చేస్తే ..కొంచం కష్టపడితే చాలు ఎన్నో బొమ్మలకు ప్రాణం పోయొచ్చు అని చెబుతాడు. దేవాలయాలు చూసినప్పుడు, సముద్రాల దగ్గర ఉన్నప్పుడు మెదడు మరింత పాదరసంలా పనిచేస్తుందంటాడు.

ప్రకృతి..పరవశం..ఆధ్యాత్మికం..ఆనందపు సమీరాలను..వెన్నెల్లో జలపాతాలను చిత్రాల్లోకి చేర్చే పనిలో పడ్డాడు. ఇప్పటికే ఎన్నో గీశాడు.త్వరలో అన్నదమ్ములు కలిసి ఆర్ట్ ఎక్జిబిషన్ నిర్వహించే పనిలో ఉన్నారు. ఆర్టిస్ట్ గా తోడైన అనుభవం లోగో, ప్రోడక్ట్ , కాన్సెప్ట్ డిజైనింగ్ లో మంచి ప్రొఫెషనల్ గా మార్చేసింది. తీరిక వేళలో అంతా సరదాగా గడుపుతూ వుంటే శ్రీకాంత్ మాత్రం ఒంటరిగా ఆర్ట్ లో లీనమవుతాడు. తన అన్న రమేష్ తో సహవాసం..ఇచ్చిన శిక్షణ..ప్రేరణ గొప్ప ఆర్టిస్ట్ గా మారేలా చేసింది. ఏడు సార్లు గ్రూప్ ప్రదర్శనలో పాల్గొన్న శ్రీకాంత్ పలు అవార్డులు అందుకున్నాడు. తన వద్ద గీసిన పెయింటింగ్స్ 25 కి పైగా ఉన్నాయి.

అందరి ఆర్టిస్టులకు భిన్నంగా తన చిత్రాలు ఉండేలా గీసేందుకు ట్రై చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే పిల్లల్లో చదువుతో పాటు పెయింటింగ్ లో కూడా మంచి ప్రతిభ చూపేలా ఆర్ట్, క్రాఫ్ట్, సంగీతం, నృత్యం తదితర అంశాలను బోధించే టీచర్స్ ఉండాలని అంటున్నాడు. మనసు స్పందించేలా..హృదయం ఆకట్టుకునేలా గీయగలిగితే ఆర్టిస్టులకు మంచి ఫ్యూచర్ ఉంటుందన్నది ఈ ఆర్టిస్ట్ ఒపీనియన్. కళ అన్నది కదిలే ప్రవాహం. దానిని ఒడిసి పట్టుకుని కుంచెలోకి చేర్చాలంటే అది ఒక్క ఆర్టిస్టులకు మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి కళాకారుల్లో శ్రీకాంత్ కూడా ఒకడు.

No comment allowed please