కాలండర్‌లోని 2020 సంవత్సరం మరి కొద్ది రోజుల్లో చరిత్రలో కలువనున్నది. విశ్వవ్యాప్తంగా ఈ ఏడాదిలో ఎన్నో ముఖ్య ఘటనలు జరిగినా కరోనా సృష్టించిన కల్లోలం ముందు అవన్నీ చిన్న విషయాలుగానే మానవాళి దృష్టికి తోచాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ అనూహ్య విజయం, ఆస్ట్రేలియా కార్చిచ్చులో 47 మిలియన్ ఎకరాలు బూడిద కావడం, బ్రిటీష్ రాయల్ కుటుంబాన్ని ప్రిన్స్ హారీ మరియు మేఘన మార్కెల్ వదిలి వెళ్ళడం, డొనాల్డ్ ట్రంప్ అభిసంశణ విచారణ ఎదుర్కోవడం, పారాసైట్ సినిమా ఆస్కర్ ఆవార్డు పొందడం, అమెరికాలో వర్ణవివక్షతో జార్జ్ ఫ్లాయిడ్ పోలీస్ హత్య ఉదంతం, ఉత్తర కొరియ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మరణ పుకారు, కరోనా టీకాల అభివృద్ధి లాంటి అనేక ముఖ్య ఘటనలు చోటు చేసుకున్నాయి.
మన ఇండియాలో 2020 ప్రధాన అంశాలుగా ప్రధమ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా జనరల్ బిపిన్ రావత్ నియామకం, ప్రపంచంలోనే 2వ అతి ఎత్తైన సర్దార్ వల్లబ్‌బాయ్ పటేల్ విగ్రహాన్ని అలహాబాద్‍లో ఆవిష్కరించడం, సిఏఏ బిల్లు అమలు, ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ విజయం, అయోధ్యలో రామ జన్మభూమి వివాదానికి సుప్రీమ్ కోర్టు తెరదించడంతో ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరగడం, హిమాచల్‌లో అటల్ టనెల్ ప్రారంభం, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ ప్రభుత్వం ఏర్పాటు, టి20 ప్రపంచ కప్ నిర్వహణ, విశాఖ విషవాయు దుర్ఘటన, నూతన విద్యా విధానం-2020, డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన, ఇండో చైనా సరిహద్దు వివాదంలో సైనికుల మరణం, అనేక చైనీస్ యాప్‌ల నిషేధం, జె అండ్ కెలో 370 ఆర్టికిల్ తొలగించిన తరువాత మెుదటిసారి జిల్లా అభివృద్ధి మండళ్లకు విజయవంతంగా ఎన్నికల నిర్వహణ, బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తుది తీర్పు లాంటివి మన కళ్ళ ముందే జరిగాయి. వీటన్నింటినీ కాదని కరోనా కమ్మిన కారు చీకట్లు మాత్రమే విశ్వ మానావాళిని అతలాకుతలం చేసిన చేదు అనుభవాలు మాత్రమే వెంటాడుతున్నాయి.
డిసెంబర్ 2019 మాసంలో చైనాదేశపు వూహాన్ నగరంలో కరోనా వైరస్ సోకడం ప్రారంభమైంది. కోవిడ్-19 (కరోనా వైరస్ డిసీజ్-2019)గా నామకరణం చేసిన ఈ ప్రమాదకర వైరస్ అంతర్జాతీయ ప్రయాణికుల ద్వారా ప్రపంచ దేశాలన్నింటికీ వ్యాపించి, కోట్ల మందికి సోకడంతో కోవిడ్-19 వ్యాధి బారిన పడడమే కాకుండా మిలియన్ల కొద్ది ప్రాణాలను మింగేసింది. చైనా ప్రభుత్వం 31 డిసెంబర్ 2019న ఐరాసకు కరోనా వైరస్ ఉనికిని తెలియజేసింది. పలు విశ్లేషణల అనంతరం 12 జనవరి 2020న ఐరాస సంస్థ డబ్ల్యూహెచ్‌ఓ కరోనా వైరస్‌ను నిర్థారించింది. ఇండియాలో 30 జనవరి 2020న కేరళలో ప్రథమ కరోనా కేసు నమోదుకాగా, 12 మార్చి 2020న మెుదటి కోవిడ్-19 కారణ మరణం నమోదైంది. కరోనా లేదా సార్స్ కోవి-19 (సివియర్ అక్యూట్ రెస్పిరేటొరీ సిండ్రోమ్ కరోనా వైరస్-19) సోకిన వ్యక్తుల సంఖ్య దినదినం పెరుగుతూ సెప్టెంబర్/అక్టోబరు-2020 నాటికి తీవ్రరూపం దాల్చింది. నేటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8 కోట్ల కరోనా కేసులు మరియు దాదాపు 18 లక్షల కోవిడ్-19 కారణ మరణాలు నమోదు కావడం విచారకరం. ఇండియాలో 1 కోటి కేసులు దాటగా దాదాపు 1.5 లక్షల మరణాలు జరిగాయి.
భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు 22 మార్చి 2020న దేశవ్యాప్తంగా కరోనా బంద్‍ను పాటించడం జరిగింది. కరోనా తీవ్రతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మార్చి 24 నుండి 03 మే వరకు పూర్తి లాక్‌డౌన్ మరియు 17 మే నుండి దేశవ్యాప్తంగా పరిమిత లాక్‌డౌన్ విధించడం జరిగింది. 01 జూన్ 2020న లాక్‌డౌన్ పూర్తిగా తొలగించి, సామాజిక క్రమశిక్షణ పాటించాలనే షరతులు పెట్టింది. కరోనా కట్టడిలో ఇండియా చూపిన చొరవను ఐరాస సంస్థ డబ్ల్యూహెచ్‌ఓ కొనియాడింది. ప్రపంచదేశాల్లో కోవిడ్-19 కారణ మరణాల రేటు ఇండియాలో తక్కువగా నమోదుకావడం ఆశ్చర్యాన్ని మరియు సంతోషాన్ని కలిగించింది.
ఇండియాలో కోవిడ్-19తో మెుదటి మరణం 12 మార్చి 2020న రికార్డు అయ్యింది. 19 ఏప్రిల్ రోజున కరోనా కేసుల సంఖ్య లక్ష మరియు మరణాలు 3 వేలు దాటింది. 03 జూన్ రోజున కేసుల సంఖ్య 2 లక్షలు మరియు మరణాలు 5,815 నమోదైనాయి. 27 జూన్ రోజున కేసుల సంఖ్య 5 లక్షలు మరియు మరణాలు 15,685 రికార్డు అయినాయి. 17 జూలై రోజున కేసుల సంఖ్య 10 లక్షలు మరియు మరణాలు 25,602 నమోదైనాయి. 16 సెప్టెంబర్‌న కేసులు 50 లక్షలు మరియు మరణాలు 82,066 జరిగాయి. 19 డిసెంబరు 2020 నాటికి కరోనా కేసుల సంఖ్య 1 కోటి దాటగా, కోవిడ్-19 కారణ మరణాలు 1,45,136 నమోదైనాయి. 24 డిసెంబర్ 2020 నాటికి మన దేశంలో 16.5 కోట్ల కరోనా పరీక్షలు చేయగా 1 కోటికి పైగా పాజిటివ్ కేసులు బయట పడ్డాయి.
కరోనా వైరస్ విజృంభనతో దేశవ్యాప్తంగా మిలియన్ల వలస దుఃఖాలు, లాక్‌డౌన్లతో ఉద్యోగ ఉపాధులు కోల్పోవడం, పేదలకు పని దొరక్కపోవడం, అన్ని రంగాల్లో ఉద్యోగుల తొలగింపు, జీతాల్లో కోతలు, విద్యాలయాలు తెరవని కారణంగా లక్షల మంది ఉపాద్యాయులు/అధ్యాపకుల సేవలను తగ్గించడం, ఆన్‌లైన్ బోధనలతో విద్యార్థినీవిద్యార్థుల ఇక్కట్లు, ఉపాద్యాయుల సరికొత్త పాట్లు, సినీ పరిశ్రమ ఆగిపోవడం, క్రీడలకు సెలవులు, రవాణా వ్యవస్థ నిలిచి పోవడం లాంటి చేదు అనుభవాలను చూడాల్సిన దుస్థితి రావడం చాలా విచారకరం. శిశు నుండి విశ్వవిద్యాలయ తరగతుల వరకు గత 8 మాసాలుగా బడులు తెరవక, ఆన్‌లైన్ తరగతులతో సంతృప్తిపడక దిక్కు తోచని స్థితి ఇప్పటికీ ఉంది. ఇటీవల ప్రపంచాన్ని భయపెడుతున్న సరికొత్త కరోనా స్ట్రేయిన్ యూకేలో ప్రారంభం కావడంతో, ఇండియాతో సహ అన్ని దేశాలు తగు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. కరోనా కల్లోలంతో ఆర్థికంగా అతి ఎక్కువ ప్రభావితమైన 15 దేశాల్లో భారత్ కూడా ఉన్నది. ఐరాస అంచనాల ప్రకారం భారత్‌కు 348 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. ఏసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ ప్రకారం 29.9 బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం కలిగిందని అంచనా వేసింది.
కరోనా కల్లోల కాలంలో మరణించిన ప్రముఖ భారతీయుల్లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, యస్ పి బాలసుబ్రహ్మణ్యం, రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్, నిషికాంత్ కామత్, పండిట్ జస్రాజ్, చేతన్ చౌహాన్, సుశాంత్ సింగ్ రాజ్‌పూత్, జగ్‌దీప్, బాసు చటర్జీ, వాజిద్ ఖాన్ లాంటి వారు ఉండడం విచారకరం. కరోనా సోకిన తరువాత చికిత్సతో బయట పడిన ప్రముఖుల్లో అమిత్ షా, యస్ యస్ రాజమౌళి, శివరాజ్ సింగ్ చౌహాన్, అమితాబచ్చన్, అభిషేక్ ఐశ్వర్య బచన్, జ్యోతిరాదిత్య సింధియా, అథితి గుప్తా లాంటి దిగ్గజాలు ఉన్నారు. నేటికీ కరోనా కమ్మిన చీకట్లు తొలగలేదు, ఎప్పుడు తొలుగుతాయో తెలియక దిక్కు తోచని స్థితిలో విశ్వమానవాళి ఉంది. ప్రతి ఒక్కరు సామాజిక దూరాలు, మాస్కుల ధారణలు మరియు పోషకాహార అలవాట్లు జీవనశైలిలో భాగం చేసుకున్నారు. త్వరలోనే కరోనాను కట్టడి చేసే ధీటైన టీకా రావాలని, విశ్వ మానవాళి జీవితం పూర్వ స్థితికి చేరాలని మానసారా కోరుకుందాం.

No comment allowed please