Yogi Adityanath: త్రివేణీ సంగమ జలాలు సురక్షిత స్థాయిలోనే ఉన్నాయి – సీఎం యోగి
త్రివేణీ సంగమ జలాలు సురక్షిత స్థాయిలోనే ఉన్నాయి - సీఎం యోగి
Yogi Adityanath : మహాకుంభమేళా జరిగిన సమయంలో త్రివేణి సంగమ జలాల్లో కాలుష్యం పెచ్చుమీరిందంటూ వచ్చిన వార్తల్ని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) సోమవారం తీవ్రంగా ఖండించారు. లఖ్‌నవూలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, ఇండియన్ పోస్టల్ సర్వీస్ అధికారుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘మలినాలున్నాయంటూ వచ్చిన ఆరోపణలు నిరాధారమే అయిన్పటికీ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు, ఇతర స్వతంత్ర ప్రయోగశాలలు జలనాణ్యత పరీక్షలు నిర్వహించి త్రివేణి సంగమ జలాలు సురక్షిత స్థాయిలోనే ఉన్నాయని తేల్చాయి’’ అని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. మహాకుంభమేళా అతిభారీ స్థాయిలో జరిగిన ఘటన కాబట్టే యునెస్కో తదితర సంస్థలు సంగమ జలాలు సురక్షితమైనవేనా అన్న ప్రశ్న లేవనెత్తాయన్నారు.
Yogi Adityanath Comment
‘‘125 సంవత్సరాలుగా ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక నదీజల కాలుష్యానికి కారణమైన ప్రదేశం కాన్పుర్. అక్కడ నాలుగు కోట్ల లీటర్ల అపరిష్కృత మురుగు జలాలు గంగలో కలిసేవి. మూడేళ్ల క్రితమే మేం నదిలోకి మురుగునీటి విడుదల నిలిపేశాం. ఇప్పుడక్కడ ఒక్క చుక్క మురుగు కూడా నదిలో కలవదు’’ అని ఆదిత్యనాథ్ అన్నారు.
ప్రయాగరాజ్ లో 45 రోజుల పాటు జరిగిన మహాకుంభ్‌మేళా లో ఒక్క నేరం కానీ, ఈవ్ టీజింగ్ వంటివి కానీ చోటుచేసుకోలేదని యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) అన్నారు. ఇటీవలే ఘనంగా ముగిసిన మహాకుంభ్‌మేళా-2025 అంశాన్ని ముఖ్యమంత్రి మంగళవారంనాడు అసెంబ్లీలో ప్రస్తావించారు. ”45 రోజులపాటు జరిగిన మహాకుంభ్‌కు దేశ, విదేశాల నుంచి 66 కోట్ల మంది హాజరయ్యారు. వీరిలో సగం మంది మహిళలే ఉన్నారు. అయినా ఒక్క వేధింపు ఘటన కానీ, దొంగతనం, అపహరణ, హత్యా ఘటన చేటుచేసుకోలేదు. అంచనాలకు మించి ప్రజలు మహాకుంభ్‌లో పవిత్ర స్నానాలు చేశారు. అద్భుతమైన అనుభూతితో తిరిగి వెళ్లారు. ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్‌ను అంతర్జాతీయ మీడియా సైతం ప్రశంసలతో ముంచెత్తింది” అని సీఎం చెప్పారు.
కోట్లాది మందితో ఇంతపెద్ద ఈవెంట్ నిర్వహించడం ద్వారా ఇటు రాష్ట్ర ప్రభుత్వ సామర్థ్యాన్ని, అటు దేశం సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పగలిగామని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. తప్పుడు సమాచారం ప్రచారం చేసేందుకు జరిగిన ప్రయత్నాలను దేశ ప్రజల విశ్వాసం వమ్ము చేసిందని చెప్పారు. మహాకుంభ్ ‘మహా’ విజయాన్ని సనాతన ధర్మం సాధించిన విజయంగా ఆయన అభివర్ణించారు.
Also Read : PM Narendra Modi: పులి పిల్లలతో ప్రధాని మోదీ ఆటలు !