Yogi Adityanath: కుంభమేళాలో ఓ కుటుంబం 30 కోట్ల ఆదాయం సంపాదించింది – సీఎం యోగి
కుంభమేళాలో ఓ కుటుంబం 30 కోట్ల ఆదాయం సంపాదించింది - సీఎం యోగి
Yogi Adityanath : ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా ఘనంగా ముగిసింది. అయితే దీని నిర్వహణపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తనదైన శైలిలో బదులిచ్చారు. పడవలు నడిపే కుటుంబాలకు పెద్దగా ఒరిగిందేమీ లేదని సమాజ్‌వాదీ పార్టీ చేసిన విమర్శకు రాష్ట్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా శాసనసభలో సీఎం యోగి(Yogi Adityanath) సమాధానమిచ్చారు. కుంభమేళా(Maha Kumbhmela) వల్ల ఎంతోమంది ఆర్థికంగా లాభపడ్డారని తెలిపారు. ఓ కుటుంబం 130 పడవలు నడిపిస్తూ ఏకంగా దాదాపు రూ.30 కోట్లు ఆర్జించిందని తెలిపారు.
CM Yogi Adityanath Comment
రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ప్రయాగ్‌రాజ్‌లో పడవలు నడిపేవారు దోపిడీకి గురయ్యారని సమాజ్‌వాదీ పార్టీ చేసిన ఆరోపణలపై సీఎం సభలో స్పందించారు. ‘‘పడవ నడిపే ఓ వ్యక్తి విజయగాథను నేను పంచుకోవాలని అనుకుంటున్నా. అతడి కుటుంబానికి 130 పడవలు ఉన్నాయి. కుంభమేళా సమయంలో ఒక్కో పడవతో రోజుకు రూ.50వేల నుంచి రూ.52వేల వరకు సంపాదించారు. అంటే 45 రోజులకు ఒక్కో పడవతో దాదాపు రూ.23లక్షల చొప్పున ఆదాయం సమకూరింది. అలా మొత్తంగా 130 పడవలతో రూ.30కోట్లు ఆర్జించారు’’ అని యోగి వివరించారు.
ఈ మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు ప్రయాగ్‌రాజ్ చేరుకుని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారని సీఎం తెలిపారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా కుంభమేళా నిర్వహించామని పేర్కొన్నారు. 45 రోజుల్లో ఒక్క నేరం కూడా చోటు చేసుకోలేదని వ్యాఖ్యానించారు. కుంభమేళా నిర్వహణ కోసం రూ.7500 కోట్ల పెట్టుబడులు పెట్టగా.. దాదాపు రూ.3లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని వెల్లడించారు.
హోటల్ పరిశ్రమకు రూ.40వేల కోట్లు, ఆహారం, ఇతర నిత్యావసరాల రంగానికి రూ.33వేల కోట్లు, రవాణాకు రూ.1.5లక్షల కోట్ల మేర ఆదాయం లభించిందన్నారు. ఆర్థికంగా చూస్తే కుంభమేళా నిర్వహణ ఈ ఏడాది దేశ జీడీపీ 6.5శాతం వృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఈ ఏడాది దేశ స్తూలజాతీయోత్పత్తికి కుంభమేళా సైతం తన వంతు వాటాను అందించింది అని యోగి చెప్పారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా జరిగిన సంగతి తెలిసిందే.
Also Read : TTD Chairman: అన్ని రాష్ట్రాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తాం – టీటీడీ ఛైర్మన్