Yogi Adityanath: జమ్మూకశ్మీర్‌లో జనం ‘రామ్ రామ్’ అంటూ నినాదాలు : యోగి ఆదిత్యనాథ్

జమ్మూకశ్మీర్‌లో జనం 'రామ్ రామ్' అంటూ నినాదాలు : యోగి ఆదిత్యనాథ్

జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ఎదురైన ఒక ఆసక్తికరమైన అనుభవాన్ని చెప్పారు. ఒక ముస్లిం తనకు ఎదురుపడి ”రామ్ రామ్” అంటూ పలకరించారని, జమ్మూకశ్మీర్‌లో 370వ అధికరణ రద్దు తర్వాత అక్కడ వచ్చిన మార్పునకు అదొక చక్కటి ఉదాహరణ అని హర్యానా లోని ఫరీదాబాద్‌ లో శనివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ఇటీవల తనకు ఎదురైన ఒక ఆసక్తికరమైన అనుభవాన్ని చెప్పారు.

”అసెంబ్లీ ఎన్నికల కోసం గత రెండ్రోజులుగా జమ్మూకశ్మీర్‌లో ఉన్నాను. అక్కడ వర్షం కురుస్తుండటంతో నేరుగా నేను విమానాశ్రయంలోకి వెళ్లాను. ఒక వ్యక్తి తనను పలకరిస్తూ ‘యోగి సాహెబ్ రామ్ రామ్’ అంటూ అభివాదం చేశారు. ఆయన ఒక మౌల్వి అని ఆ తర్వాత తెలిసింది. ఒక మౌల్వి నోటి నుంచి ‘రామ్ రామ్’ అని రావడం చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను” అని ఆదిత్యనాథ్ తెలిపారు. 370వ అధికరణ రద్దు ప్రభావం ఇదని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సవాలు చేసిన వ్యక్తులు ఇప్పుడు ‘రామ్ రామ్’ అంటున్నారని యోగి చెప్పారు. దీంతో ఫరీదాబాద్ ర్యాలీకి హాజరైన జనం ‘రామ్ రామ్’ అంటూ నినాదాలు చేశారు. వారిని యోగి మరింత ఉత్సాహపరుస్తూ, పటిష్ఠ భారతదేశం, పటిష్ట బీజేపీతో ఒకనాటికి దేశంలోని వీధులన్నీ ”హరే రామ హరే కృష్ణ” సంకీర్తనలతో మారుమోగుతాయని అన్నారు.

ఉత్తరప్రదేశ్‌లో తన నాయకత్వంలో గత ఏడున్నరేళ్లుగా ఎలాంటి మత ఘర్షణలు చోటుచేసుకోలేదని ఈ సందర్భంగా యోగి తెలిపారు. పొరుగు రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో గత ఏడున్నరేళ్లుగా ఏవైనా ఘర్షణలు జరిగినట్టు మీరు విన్నారా? అని ఆయన సభికులను ప్రశ్నించగా.. ‘లేదు’ అంటూ జనం స్పందించారు.
అధికారంలోకి రాకముందు ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి అల్లర్లు జరిగేవని యోగి ఈ సందర్భంగా గుర్తుచేశారు. కాగా, 90 మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 5న పోలింగ్ జరుగనుంది. ఫలితాలు అక్టోబర్ 8న వెలువడతాయి. తొలుత అక్టోబర్ 1న పోలింగ్ తేదీని ఎన్నికల కమిషన్ ప్రకటించినప్పటికీ వివిధ పార్టీల విజ్ఞప్తి మేరకు 5వ తేదీకి పోలింగ్‌ను వాయిదా వేసింది. హర్యానాతో పాటు జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాల తేదీని అక్టోబర్ 8కి వాయిదా వేసింది.

Leave A Reply

Your Email Id will not be published!