YS Jagan : సింగయ్య మృతి కేసులో పోలీసుల అదుపులో జగన్‌ కారు డ్రైవర్‌

సింగయ్య మృతి కేసులో పోలీసుల అదుపులో జగన్‌ కారు డ్రైవర్‌

YS Jagan : పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ వాహనం ఢీకొని సింగయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. యాక్సిడెంట్‌లో సింగయ్య చనిపోయిన రోజు ఐపీఎస్‌లోని 304ఏ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కెమెరా విజువల్స్‌లో అది జగన్ ప్రయాణిస్తున్న కారు అని తేలడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఈ క్రమంలో జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డిని నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో A1గా కారు డ్రైవర్ రమణారెడ్డిని, A2గా వైఎస్ జగన్‌ను, A3గా కారు యజమానిని చేర్చాలని పోలీసులు నిర్ణయించారు. జగన్‌ కారు డ్రైవర్‌ను నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకుని… అతడి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనం కింద వ్యక్తి పడినట్లు గుర్తించారా ? ఆ సమాచారాన్ని జగన్‌కు తెలియజేశారా ? ప్రమాదం జరిగిన వెంటనే వాహనం ఆపకుండా ఎందుకు వెళ్లిపోయారు ? తదితర విషయాలపై జగన్‌ (YS Jagan) కారు డ్రైవర్‌ నుంచి సమాచారాన్ని పోలీసులు తెలుసుకుంటున్నారు.

మరోవైపు జగన్‌ (YS Jagan) పర్యటనకు సంబంధించి వీడియోలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆయన పర్యటనను ఎవరెవరు వీడియోలు తీశారనే దానిపై ఆరా తీస్తున్నారు. వారి నుంచి ఫుటేజీని సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎఫ్ఐఆర్‌లో అదనంగా 304 పార్ట్ 2 సెక్షన్ వర్తించే అవకాశం ఉంది. బీఎన్‌ఎస్ చట్టంలోని సెక్షన్ 105 కింద కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉంది. ఎఫ్ఐఆర్‌లో సెక్షన్స్ మార్చి కోర్ట్ మెమో పంపాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారులు అందరూ భేటి అయ్యారు. ఈ సంఘటన జరిగిన సమయంలో ఉన్న వ్యక్తుల కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. అప్పుడు బందోబస్తులో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందిని కూడా ఉన్నతాధికారులు పిలిపిస్తున్నారు.

YS Jagan – బలప్రదర్శన చేసి సింగయ్య మృతికి జగన్‌ కారణమయ్యారు: వైఎస్‌ షర్మిల

జగన్‌ (YS Jagan) వాహనం కింద పడి సింగయ్య (Singayya) నలిగిపోయిన దృశ్యాలు భయానకంగా, ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయని ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు. వైసీపీ బలప్రదర్శనలకు, హత్యలకు జగన్‌ ఏం సమాధానం చెబుతారంటూ ‘ఎక్స్‌’ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు.

‘‘కారు కింద పడ్డారని చూడకుండా కాన్వాయ్‌ కొనసాగించడం ఏంటి? వందమందికి పర్మిషన్‌ ఇస్తే వేలమంది ముందు జగన్‌ చేతులూపడం ఏంటి? ప్రజల ప్రాణాలు తీసే హక్కు మీకు ఎవరిచ్చారు? బెట్టింగ్‌లో ఓడిపోయి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి విగ్రహావిష్కరణకు ఇద్దరిని బలి ఇస్తారా? ఇదేం రాజకీయం.. ఇదెక్కడి రాక్షస ఆనందం. మీ ఉనికి కోసం జనాలను టైర్ల కింద తొక్కుకుంటూ పోతారా? ప్రజల ప్రాణాలతో శవ రాజకీయాలు చేస్తారా? కారు సైడ్‌ బోర్డ్‌ మీద నిలబడి ఒక నాయకుడిగా కాన్వాయ్‌ మూవ్‌ చేయించడం సబబేనా? ఇది పూర్తిగా జగన్‌ బాధ్యతా రాహిత్యానికి అద్దం పడుతోంది.

బలప్రదర్శన చేసి సింగయ్య మృతికి జగన్‌ కారణమయ్యారు. పర్మిషన్‌కి విరుద్ధంగా జన సమీకరణ జరుగుతుంటే పోలీసులు ఎలా సహకరించారు? ఎందుకు ప్రేక్షక పాత్ర వహించారు? ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను ఎందుకు నిద్ర పుచ్చారు? ప్రజా సమస్యలపై పోరాడితే ఆంక్షలన్నీ కాంగ్రెస్ పార్టీకేనా? కాంగ్రెస్ చేసే ఉద్యమాలకు, ధర్నాలకు హౌస్‌ అరెస్ట్‌లు చేస్తారు. దీక్షలు భగ్నం చేస్తారు. ర్యాలీలను తొక్కిపెట్టి మా గొంతు నొక్కుతారు. వైకాపా చేసిన బలప్రదర్శనలకు, హత్యలకు జగన్ ఏం సమాధానం చెబుతారు? కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?’’ అని షర్మిల ప్రశ్నించారు.

Also Read : Sajjala Ramakrishna Reddy: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పై క్రిమినల్ కేసు

Leave A Reply

Your Email Id will not be published!