YS Jagan: ‘చంద్రబాబు సర్కార్‌’పై నిప్పులు చెరిగిన వైఎస్‌ జగన్‌

‘చంద్రబాబు సర్కార్‌’పై నిప్పులు చెరిగిన వైఎస్‌ జగన్‌

 

అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రక్కనపెట్టిన చంద్రబాబు ప్రభుత్వం…. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందంటూ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఏడాది పాలనలో అన్ని రంగాల్లో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం ఎప్పటికప్పుడు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తూ, ప్రశ్నించే గొంతులు నొక్కుతూ, యథేచ్ఛగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వ అనైతిక పర్వాన్ని వైఎస్ జగన్ నిలదీశారు.

 

ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ… వైసీపీ ఐదేళ్ల పాలనలో 3.32 లక్షల కోట్లు అప్పులు చేస్తే… చంద్రబాబు ఏడాది పాలనకే 1.37లక్షల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. ఐదేళ్లలో చెయ్యాల్సిన అప్పుల్లో 40శాతం ఏడాదిలోనే చేసేసి చంద్రబాబు అప్పుల సామ్రాట్ అయ్యారని అన్నారు. తెచ్చిన అప్పులన్నీ రాష్ట్ర ఖజానాకు రావడం లేదు. చంద్రబాబు అండ్ కో జేబుల్లోకి వెళ్తుంది. ఏపీఎండీసీను శాశ్వతంగా అప్పుల్లోకి నెట్టేసి అంధకారం చేస్తున్నారు. ప్రభుత్వ మైన్స్ ను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇది చాలా దారుణం అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

సోలార్ ఎనర్జీ కొనుగోలు పేరుతో 11 వేల కోట్ల స్కామ్ కి తెర లేపారు. సెకీ తో మేము చేసుకున్న ఒప్పందం వల్ల 89 వేల కోట్లు ఆదా అయ్యేది. విశాఖలో ఉర్షా అనే ఊరు పేరు లేని సంస్థకు 3 వేల కోట్ల భూములు కట్టబెట్టారు. 2వేల కోట్లు విలువ చేసే భూమి అప్పనంగా లులూ మాల్ కి ఇచ్చేస్తున్నారు. లిక్కర్, ఇసుక, మట్టి, మైనింగ్ మాఫియా రాష్ట్ర ఖజానా మొత్తం దోస్తున్నారంటూ జగన్ విమర్శించారు. అమరావతి పేరుతో చేస్తున్న దోపిడీ స్కాములనింటికీ పరాకాష్ట. ఈ స్కామ్ కోసం జ్యుడీషియల్‌ ప్రివ్యూను, రివర్స్ టెండరింగ్ ని రద్దు చేసేశారు. దోపిడీ కోసం మొబిలైజేషన్ అడ్వాన్స్‌ని మళ్లీ తీసుకొచ్చారు. నిర్మాణాలకు అడుగుకి 9వేలకి టెండర్లు ఇచ్చారు. వీళ్లేమైనా బంగారంతో కడుతున్నారా..? అంటూ జగన్ ప్రశ్నించారు. ఎస్ఎఫ్టీకి రూ.4వేలు పెడితే ఇటాలియన్ మార్బుల్స్‌తో లగ్జరీ భవనాలు కట్టొచ్చు. అసెంబ్లీ, సచివాలయం ఆరు లక్షల ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలో ఆల్రెడీ ఉన్నాయి. మళ్లీ కొత్తగా కడుతున్నారట.. మొత్తం ఉద్యోగులు 12వేల మంది లేరు 50లక్షల ఎస్ఎఫ్టీ నిర్మాణాలు ఎందుకు..? అంటూ జగన్ ప్రశ్నించారు.

హైదరాబాద్ లో కేసీఆర్ కట్టిన సచివాలయం 8 లక్షల ఎస్ఎఫ్టీ విస్తీర్ణం లో 616 కోట్లకు కట్టారు. కొత్తవి కట్టాలనే ఆలోచన ఉన్నప్పుడు తాత్కాలికాలు కట్టడం ఎందుకు? కొత్తవి కట్టడం వల్ల 600 కోట్లు గంగపాలు చేసినట్లే కదా..? అప్పులు తీసుకొచ్చి కొత్త భవనాలు ఎందుకు..? అమరావతి రోడ్లకు కిలో మీటర్ కు 11 కోట్లు ఉంటే 15కోట్లకు పెంచారు. అమరావతి కోసం చేస్తున్న అప్పులు ఆకాశాన్ని అంటుతున్నాయని జగన్ అన్నారు. ఇప్పటి వరకు 50వేల కోట్లకుపైగా అప్పలు చేశారు. అవి చాలవని 77వేల కోట్లకుపైగా అప్పులు కావాలని అంటున్నారని జగన్ విమర్శించారు. రాష్ట్రం కోసం చంద్రబాబు చెయ్యాలంటే విజయవాడ, గుంటూరు మధ్యలో 500 కోట్లు ఖర్చు పెట్టి భవనాలు కట్టు. భవిష్యత్తులో విజయవాడ, గుంటూరు నగరాలు కలుస్తాయి. పెద్ద నగరం ఏర్పడుతుంది. అమరావతి పేరుతో మీరు చేస్తున్న హడావిడికి ఇప్పటికే గుంటూరు, విజయవాడలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని జగన్ విమర్శించారు.

 

 

‘‘రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక జరిగిన హత్యలు 390. హత్యలు, హత్యాయత్నాలు, దాడులకు గురైన వైఎస్సార్‌సీపీ, నాయకులు, కార్యకర్తలు 766 మంది. వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు 2,466. జైలుకు వెళ్లిన వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు 500 మంది. అక్రమ కేసులు నమోదైన సోషల్‌ మీడియా యాక్టివిస్టులు 440 మంది. కేసులు నమోదై జైలుకు వెళ్లిన సోషల్‌ మీడియా యాక్టివిస్టులు 79 మంది. దాడులకు గురైన జర్నలిస్టులు 11 మంది. జర్నలిస్టులపై అక్రమ కేసులు 63. మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు 198. ప్రజాసంఘాల నాయకులపై అక్రమ కేసులు 73. జైలుకు వెళ్లిన ప్రజాసంఘాల నాయకులు 2. జైళ్లకు వెళ్లిన జర్నలిస్టులు 8 మంది’’ అని మీడియాకు వివరించారు.

‘‘టీడీపీ పాలనలో వేధింపులకు గురైన అధికారులు 199 మంది. వారిలో ఏఎస్పీలు 27, డీఎస్పీలు 42, సీఐలు 119 మంది. ఐపీఎస్‌లు డీజీ ర్యాంకు అధికారి పీఎస్‌ఆర్‌ అంజనేయులు, డీజీ ర్యాంక్‌ దళిత అధికారి సునీల్‌ కుమార్, అడిషనల్‌ డీజీ ర్యాంకు అధికారి సంజయ్‌ ఐపీఎస్, సీనియర్‌ ఆఫీసర్, ఐజీ ర్యాంక్‌ కాంతిలాల్‌ రాణా, ఐజీ ర్యాంక్‌ ఆఫీసర్‌ విశాల్‌ గున్నీ, ఐజీ ర్యాంకు అధికారి రఘురామిరెడ్డి, రవిశంకర్‌ రెడ్డి, నిశాంత్‌ రెడ్డి ఐపీఎస్‌ లు, ఐపీఎస్‌ అధికారి పి.జాషువా, వేధింపులకు గురయ్యారు. మరో రిటైర్డ్‌ అధికారి విజయ్‌పాల్‌ను అక్రమంగా అరెస్టు చేశారు. పార్టీ ట్విట్టర్‌ హ్యాండిల్, నా వ్యక్తిగత ట్విట్టర్‌ హ్యాండిల్‌లో కూడా ఈ సమాచారాన్ని అప్‌ లోడ్‌ చేస్తాం’’ అని వైఎస్‌ జగన్‌ తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!