YS Sharmila: ఉద్రిక్తతలకు దారి తీసిన ‘చలో సెక్రటేరియట్’ ! వైఎస్ షర్మిల అరెస్టు !
ఉద్రిక్తతలకు దారి తీసిన ‘చలో సెక్రటేరియట్’ ! వైఎస్ షర్మిల అరెస్టు !
YS Sharmila: మెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్ తో ఏపీ కాంగ్రెస్ పిలుపునిచ్చిన ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ నుంచి ర్యాలీగా బయలుదేరిన ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీనితో చల్లపల్లి బంగ్లా వద్ద వైఎస్ షర్మిల రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల వలయం నుండి తప్పించుకుని షర్మిల… సెక్రటేరియట్ కు వెళ్తున్నారనే సమాచారంతో కరకట్టపై షర్మిలను అరెస్టు చేసేందుకు వందలాది మంది పోలీసులను మోహరించారు. తొలుత కార్యకర్తలు, నాయకులను బలవంతంగా వాహనాల్లో తరలించారు. గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. షర్మిల(YS Sharmila) కారు దిగగానే చుట్టుముట్టి బలవంతంగా అరెస్టు చేసి పోలీసు వాహనం ఎక్కించారు. ఈ క్రమంలో కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ‘సీఎం డౌన్ డౌన్’ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. షర్మిలతో పాటు కార్యకర్తలు, నాయకులను దుగ్గిరాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
YS Sharmila Arrest Viral
ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ… నిరుద్యోగుల పక్షాన పోరాటానికి పిలుపునిస్తే నిర్బంధిస్తారా ? ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా ? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న మమ్మల్ని ఆపాలని చూస్తున్నారంటే మీరు భయపడుతున్నట్లే. మీ అసమర్థతను కప్పిపుచ్చాలని చూస్తున్నారు. ఎన్ని ఆటంకాలు కలిగించినా నిరుద్యోగుల పక్షాన పోరాటం ఆగదు’’ అని పేర్కొన్నారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు ‘చలో సెక్రటేరియట్’ లో పాల్గొనేందుకు బుధవారం రాత్రి విజయవాడ చేరుకున్న వైఎస్ షర్మిల… రాత్రి ఆంధ్రరత్న భవన్ లోనే నిద్రించారు. గురువారం ఉదయం అక్కడికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకుని బారికేడ్లు ఏర్పాటు చేశారు. పలుచోట్ల కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం, ముందస్తు అరెస్టులు చేశారు.
Also Read : MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు !