YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న మృతి
వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న మృతి
YS Viveka : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రంగన్న… కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. 85 ఏళ్ల రంగన్న వయసు రీత్యా పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. బుధవారం మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురవడంతో పోలీసులు రంగన్నను ఆసుపత్రికి తరలించగా… చికిత్స పొందుతూ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.
YS Viveka Murder Case Updates
2019 మార్చి 15న పులివెందులలో వివేకానందరెడ్డి(YS Viveka) హత్యకు గురైన విషయం విదితమే. అప్పట్లో వివేకా ఇంటి వద్ద వాచ్మెన్ గా పని చేసిన రంగన్న సీబీఐకి వాంగ్మూలం ఇస్తూ పలు కీలక అంశాలు బయటపెట్టారు. హత్య కేసులో కీలక సాక్షిగా నమోదు చేసిన సీబీఐ ఛార్జిషీట్లో సైతం పలు అంశాలు పేర్కొంది. దీనితో వివేక హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న రంగయ్యకు గతంలో సీబీఐ గన్మెన్లను కూడా కేటాయించింది. కాగా, వయసు రీత్యా పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న రంగయ్య.. బుధవారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసు విచారణ సమయంలో కీలకంగా ఉపయోగపడే రంగన్న మృతి చెందడం తీవ్ర చర్చనీయాంశమైంది.
Also Read : Konidela Nagababu: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు చేసిన పవన్ కళ్యాణ్