YSRCP: వైసీపీకు బిగ్ షాక్ ! కడప మేయర్‌, మాచర్ల చైర్మెన్లను పదవి నుండి తొలగింపు !

వైసీపీకు బిగ్ షాక్ ! కడప మేయర్‌, మాచర్ల చైర్మెన్లను పదవి నుండి తొలగింపు !

 

 

2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిని వైసీపీకు… బుధవారం మూడు భారీ షాక్ లు తగిలాయి. తన బంధవులకు కాంట్రాక్టులు అప్పగించడం ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసారనే ఆరోపణలపై కడప మేయర్‌ సురేష్‌ బాబుపై… ప్రభుత్వం అనర్హత వేటు వేసింది. అలాగే ఏపీ మున్సిపల్ యాక్ట్‌లోని సెక్షన్ 16(1)(కె )ను ఉల్లంఘించినందుకు మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ పదవి నుంచి తురకా కిషోర్‌ ను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండింటి నుండి కోలుకోక ముందే… మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జాకీయా ఖానమ్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.

కడప మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు

 

కడప మేయర్‌ సురేష్‌ బాబుపై అనర్హత వేటు పడింది. విజిలెన్స్‌ విచారణ నివేదిక ఆధారంగా మేయర్‌ పదవి నుంచి సురేష్‌బాబును తొలగిస్తూ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి బుధవారం జీవో జారీ చేశారు. కడప నగరంలో అభివృద్ధి పనులను ఇష్టారాజ్యంగా తన కుటుంబానికి చెందిన గుత్తేదారు సంస్థ ఎంఎస్‌ వర్ధిని కన్‌స్ట్రక్షన్స్‌ ద్వారా చేయించినట్లు విజిలెన్స్‌ ఆధారాలు సేకరించింది. మేయర్‌ పదవిని అనుభవిస్తూ ప్రత్యక్షంగా/ పరోక్షంగా ఆయన/ కుటుంబసభ్యులు గుత్తేదారు పనులు చేయవచ్చా?.. చేయరాదనే విషయం మేయర్‌ దృష్టికి తీసుకెళ్లారా?.. మొత్తంగా వర్ధిని కంపెనీ ఎన్ని పనులు చేపట్టిందనే విషయాలు రాబట్టింది.

 

గుత్తేదారు కంపెనీ డైరెక్టర్లుగా మేయర్‌ కుమారుడు అమరేశ్, భార్య జయశ్రీ ఉన్నారు. పురపాలక చట్టం నిబంధనలు అతిక్రమించినందున పదవులకు అనర్హులవుతారనే సమాచారాన్ని కమిషనర్‌ మనోజ్‌రెడ్డి నుంచి రాతపూర్వకంగా తీసుకున్నారు. ఇదే విషయాన్ని మేయర్‌ కు సైతం తెలియజేస్తూ కమిషనర్‌ లేఖ రాశారు. మంగళవారం మున్సిపల్‌శాఖ కార్యదర్శి ఎదుట హాజరై సురేష్‌బాబు వివరణ ఇచ్చారు. కమిషనర్‌ ఇచ్చిన సమాచారంతో విజిలెన్స్‌ అధికారులు ప్రభుత్వానికి విచారణ నివేదిక అందించారు. ఈ నివేదిక ఆధారంగా పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి నిర్ణయం తీసుకున్నారు. మొత్తం రూ.36లక్షలు అవినీతికి పాల్పడినట్టు సురేష్‌బాబుపై ఆరోపణలున్నాయి.

మాచర్ల మున్సిపల్ చైర్మెన్ తురకా కిషోర్ ను తొలగించిన ప్రభత్వం

మాచర్ల మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్‌కు కూటమి ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ పదవి నుంచి తురకా కిషోర్‌ను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ఏపీ మున్సిపల్ యాక్ట్‌లోని సెక్షన్ 16(1)(కె )ను ఉల్లంఘించినందుకు అతడిని ఈ పదవి నుంచి తొలగించినట్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. గత 15 మున్సిపల్ కౌన్సిల్ మీటింగులకు ఆయన హజరు కాలేదని తేలడంతో ఈ పదవి నుంచి అతడిని తొలగించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం తురకా కిషోర్ పోలీసుల అదుపులో ఉన్నట్టు జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

 

మరోవైపు ఛైర్మన్ అధికారాలను దుర్వినియోగం చేసిన కేసులో చర్యలు ఎందుకు తీసుకోకూడదంటూ ఇప్పటికే తురకా కిషోర్‌కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై అతడి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో తురకా కిషోర్‌ను మాచర్ల ఛైర్మన్ పదవి నుండి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికల అనంతరం పల్నాడులోని మాచర్లలో టీడీపీ సీనియర్ నేతలు బోండా ఉమా, బుద్దా వెంకన్న పర్యటించారు. ఈ సందర్భంగా వారి పర్యటిస్తున్న కారుపై తురకా కిషోర్ దుడ్డు కర్రతో దాడి చేశాడు. ఈ కేసులోనూ అతడు నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.

 

వైసీపీ ఎమ్మెల్సీ జాకీయా ఖానమ్ రాజీనామా

 

శాసన మండలిలో వైసీపీకి మరో వికెట్ డౌన్ అయింది. మండలి డిప్యూటీ చైర్మెన్‌ గా ఉన్న జకియా ఖానమ్ పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. అకస్మాత్తుగా ఆమె రాజీనామా చేయడంతో పార్టీలో కలకలం రేగింది. దీనితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆమె గట్టి షాక్ ఇచ్చినట్లయింది. కాగా బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ఆమె బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, మంత్రి సత్యకుమార్‌ను జాకీయా ఖానమ్ కలిసినట్లు తెలియవచ్చింది. కాగా మంగళవారం రాత్రి తన రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి మెయిల్‌ లో పంపారు. ప్రస్తుతం రాజీనామా చేసిన జాకియా ఖానమ్‌ను 2020 జులైలో ఎమ్మెల్సీగా గవర్నర్ నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.

 

Leave A Reply

Your Email Id will not be published!