YSRCP: ఎమ్మెల్సీ నాగబాబు ప్రశ్నకు వైసీపీ వాకౌట్
ఎమ్మెల్సీ నాగబాబు ప్రశ్నకు వైసీపీ వాకౌట్
YSRCP : శాసన మండలి సమావేశాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. 2019-24 మధ్య కాలంలో తప్పుడు క్రిమినల్ కేసుల పరిష్కారంపై శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు (MLC Nagababu) అడిగిన ప్రశ్నకు హోం మంత్రి వంగలపూడి అనిత సమాధానం ఇచ్చారు. ఈ మేరకు వంగలపూడి అనిత ఇచ్చిన సమాధానాన్ని నిరసిస్తూ మండలి నుంచి వైసీపీ (YSRCP) వాకౌట్ చేసింది. గత ప్రభుత్వం చాలా మందిపై అక్రమ కేసులు పెట్టిందని అనిత ఆరోపించారు. అమరావతి రైతులు రాజధాని కోరుకుంటే వందలాది మందిపై కేసులు పెట్టారని మండిపడ్డారు.
YSRCP – MLC Nagababu
గత ప్రభుత్వం తనపైన కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడితే కడప కోర్టుకు హాజరయ్యానని మంత్రి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు, అంగన్ వాడీలు, ఆశావర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తే కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులపై 3116 అక్రమ కేసులు పెట్టారని పేర్కొన్నారు. చాలా మంది విద్యార్థులపై రాజకీయ కక్ష సాధింపు కోసం కేసులు పెడితే వారికి ఉద్యోగాలు రావడం లేదని విచారం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులను త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
కేసుల పరిష్కారం కోసం పోలీసు, లా డిపార్టుమెంట్ సమన్వయంతో పనిచేస్తున్నాయని హోం మంత్రి అనిత చెప్పారు. చీకటి జీవోలు తెచ్చే సంస్కృతి కూటమి ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. రికార్డులు, లా ప్రకారం కేసులు పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. సీపీఎస్ రద్దు కోరుతూ టీచర్లు చేసిన ఆందోళనలో.. నమోదైనా కేసులలో ఇప్పటి వరకు 80 శాతం కేసులను ఎత్తివేశామని తెలిపారు. మిగిలిన కేసులను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అనిత స్పష్టం చేశారు.
వైసీపీ వాకౌట్
హోం మంత్రి అనిత చేసిన వ్యాఖ్యలను విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఖండించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 16 నెలలైనా తప్పుడు కేసులు ఎందుకు పరిష్కరించలేదని ఆయన ప్రశ్నించారు. ప్రజా హితం కాకుండా రాజకీయ కోణంలో హోం మంత్రి సమాధానం చెబుతున్నారని ఆరోపించారు. హోం మంత్రి అనిత చెప్పిన సమాధానానికి నిరసనగా వైసీపీ వాకౌట్ చేస్తున్నట్లు బొత్స ప్రకటించారు.
కాకినాడ జిల్లా ఉప్పాడలో రోడ్డెక్కిన మత్స్యకారులు
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో మత్స్యకారులు రోడ్డెక్కారు. తీర ప్రాంతాల్లో ఫార్మా కంపెనీల నుంచి రసాయన వ్యర్థాల కారణంగా మత్స్య సంపద నశించి జీవనోపాధి కోల్పోతున్నామంటూ ఆందోళనకు దిగారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మత్స్యకారులు.. రహదారిని మూసివేసి బైఠాయించారు. వ్యర్థాలు సముద్రంలోకి విడుదల చేయకుండా చర్యలు చేపట్టాలని.. ఉప్పాడ తీరప్రాంత మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.1.50 లక్షలు ఇవ్వాలన్నారు. ఉప్పాడతో పాటు సమీప మత్స్యకార గ్రామాల ప్రజలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
Also Read : Batthula Prabhakar: ఏపీలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ పరారీ
