Vaishno Devi: వైష్ణోదేవి మార్గంలో కొండచరియలు విరిగిపడి 41 మంది మృతి

వైష్ణోదేవి మార్గంలో కొండచరియలు విరిగిపడి 41 మంది మృతి

Vaishno Devi : మాతా శ్రీ వైష్ణోదేవి మందిరానికి వెళ్లే మార్గంలో విషాద ఘటన చోటుచేసుకుంది. అర్ద్‌కువారి వద్ద ఇందప్రస్థ భోజనాలయ సమీపంలో కొండచరియలు విరిగిపడి ఇప్పటివరకు 41 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో 34 మంది వరకు గాయపడ్డారు. 18 మృతదేహాలను వెలికితీసి జమ్మూలోని మెడికల్‌ కళాశాలకు తరలించారు. వారిని పంజాబ్‌, దిల్లీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన యాత్రికులుగా గుర్తించారు. మరోవైపు ప్రమాదకర మార్గాల్లో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. తీవ్రంగా గాయపడిన పలువురిని వైద్యచికిత్స అందిస్తున్నారు. శ్రీమాతా వైష్ణోదేవి (Vaishno Devi) ఆలయ బోర్డు సమన్వయంతో ఎమర్జెన్సీ రెస్క్యూ టీమ్‌లు తక్షణ సహాయక చర్యలు చేపట్టాయి.

Vaishno Devi Temple Way

భారీ వర్షాల కారణంగా జమ్మూకశ్మీర్‌ వ్యాప్తంగా పలుచోట్ల వరదలు సంభవించాయి. దక్షిణ కశ్మీర్‌లోని జీలం నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ముప్పు నేపథ్యంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వైష్ణోదేవి (Vaishno Devi) ఆలయానికి వెళ్లే మార్గంలో జరిగిన ప్రమాదంపై అక్కడి ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వాతావరణ హెచ్చరికలు ఉన్నప్పటికీ… ఆ మార్గంలో యాత్రికులను ఎందుకు అనుమతించారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురియడంతో ఆలయ బోర్డు ముందుజాగ్రత్త చర్యగా వైష్ణోదేవి యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ‘భక్తుల భద్రత మాకు చాలా ముఖ్యం. పరిస్థితులు మెరుగుపడగానే యూత్ర తిరిగి ప్రారంభమవుతుంది’ అని మందిర బోర్డు ప్రతినిధులు తెలిపారు. కాగా, వదంతులు నమ్మవద్దని, మందిర బోర్డు అధికారికంగా ఎప్పటికప్పుడు విడుదల చేసిన సమాచారాన్ని పాటించాలని భక్తులను అధికారులు కోరారు.

వైష్ణోదేవి యాత్రపై తర్జన భర్జన

తాజా పరిస్థితుల నేపథ్యంలో వైష్ణోదేవి (Vaishno Devi) యాత్రను కొనసాగించాలా? వద్దా? అన్నదానిపై అక్కడి ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఆలోచించి దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ‘‘వాతావరణ పరిస్థితుల గురించి ముందుగానే తెలిసినప్పుడు.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఘటనపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాతావరణం అనుకూలించడం లేదని తెలిసి కూడా ఆ మార్గంలో యాత్రికులు ఎందుకు వెళ్లారు? అధికారులు ఎందుకు అనుమతించారు? సురక్షిత ప్రాంతాలకు వారిని ఎందుకు తరలించలేదు.

ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాల్సి ఉంది.’’ వీటన్నింటిపై చర్చించి యాత్ర కొనసాగించాలా? వద్దా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటాం.’’ అని సీఎం వెల్లడించారు. వైష్ణోదేవి (Vaishno Devi) ఆలయానికి వెళ్లేందుకు రెండు మార్గాలున్నాయి. కొండచరియలు విరిగిపడిన తర్వాత మంగళవారం నుంచి హిమ్‌కోటి ట్రెక్ మార్గంలో రాకపోకలను నిషేధించారు. కేవలం తారాకోట్‌ మార్గంలోనే యాత్రికులను అనుమతించారు. ఆ తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆ మార్గంలోనూ రాకపోకలను నిలిపివేశారు.

జమ్మూలోని రెండు ప్రాంతాల్లో క్లౌడ్‌బరస్ట్‌ల కారణంగా నేషనల్ హైవే-244 కోట్టుకుపోయినట్టు దోడా డీసీ హర్వీందర్ సింగ్ తెలిపారు. మెరుపువరదలకు గాంధోహ్‌లో ఇద్దరు, థాథ్రి సబ్‌డివిజన్‌లో ఒకరు చనిపోయినట్టు తెలిపారు. 15కు పైగా ఇళ్లు, పలు గోశాలలు, ఒక ప్రైవైటు ఆరోగ్య కేంద్రం దెబ్బతిన్నాయి. మూడు పాదచారుల వంతెనలు వరదలకు కొట్టుకుపోయాయి. దీనితో పలు రైళ్లను కూడా రద్దు చేశారు. కత్రా నుండి బయలుదేరే దాదాపు 10 రైళ్లు రద్దయ్యాయి. నదులు పొంగిపొర్లుతున్నాయి జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై చందర్‌కోట్, కేలా మోర్, బ్యాటరీ చెష్మా వద్ద వాహనాలను నిలిపివేశారు. ఉధంపూర్, కాజిగుండ్ వద్ద కూడా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కిష్త్‌వార్, రాంనగర్‌-ఉధంపూర్, జంగల్వార్-థత్రి మార్గాలు దెబ్బతిన్నాయి.

కథువా జిల్లాలో సహార్ ఖడ్ నదిపై వంతెన దెబ్బతింది. దీనితో జమ్మూ-పఠాన్‌ కోట్ హైవేపై రవాణా నిలిచిపోయింది. నదులు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. మొధోపూర్ బ్యారేజ్ ఒక లక్ష క్యూసెక్కుల నీటిని దాటి పోయింది. ఉధంపూర్‌లో తావి నది 20 అడుగుల ప్రమాద స్థాయిని దాటి పోయింది. చెనాబ్ నది 899.3 మీటర్లకు చేరింది. ఆగస్టు 27 వరకు జమ్మూ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, దక్షిణ కాశ్మీర్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Also Read : Tirumala: చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబరు 7న శ్రీవారి ఆలయం మూసివేత

Leave A Reply

Your Email Id will not be published!