Yashwant Sinha : రాష్ట్రపతిగా ఎన్నికైతే సీఏఏని అడ్డుకుంటా
పౌరసత్వ చట్టంపై సిన్హా కామెంట్స్
Yashwant Sinha : విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న యశ్వంత్ సిన్హా(Yashwant Sinha) సంచలన కామెంట్స్ చేశారు. తాను రాష్ట్రపతిగా ఎన్నికైతే దేశంలో పౌరసత్వ చట్టం అమలు కాకుండా చూస్తానని చెప్పారు.
భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ముసాయిదాను సరిగా తయారు చేయలేదని సిన్హా ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ అస్సాం ప్రతిపక్ష శాసనసభ్యులతో సమావేశం అయ్యారు యశ్వంత్ సిన్హా. అసోంకు పౌరసత్వం ప్రధాన సమస్య. ప్రభుత్వం దేశ వ్యాప్తంగా చట్టం తీసుకు రావాలని భావించింది.
కానీ అది ఇంకా చేయలేక పోయిందన్నారు సిన్హా. ఇంతకు ముందు కేంద్రం కోవిడ్ ను సాకుగా చూపించిందన్నారు. కానీ ఇప్పుడు కూడా దానిని వారు అమలు చేయడంలో విఫలమయ్యారంటూ మండిపడ్డారు.
ముందస్తు ఆలోచన లేకుండా చేసిన ప్రయత్నమే ఈ చట్టమని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని దానిని కాపాడు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆవేదన వ్యక్తం చేశారు యశ్వంత్ సిన్హా.
అధికారంలో ఉన్న వారే దానిని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
తాను రాష్ట్రపతి భవన్ లో ఉంటే సీఏఏకి మంగళం పాడినట్లేనని పేర్కొన్నారు. ఈనెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి.
ఇందు కోసం ప్రతిపక్షాల మద్దతు కోరేందుకు యశ్వంత్ సిన్హా ఒక రోజు అస్సాంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ ఘన స్వాగతం పలికింది.
Also Read : 15న అగ్నిపథ్ పై సుప్రీంకోర్టు తీర్పు