Mallikarjun Kharge Comment : పార్టీ పగ్గాలు సరే పవర్ మాటేంటి
ఖర్గే కాంగ్రెస్ ను కాపాడతారా
Mallikarjun Kharge Comment : ఘనమైన వారసత్వం కలిగిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. 24 ఏళ్ల తర్వాత గాంధీయేతర వ్యక్తి పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం తొలిసారి. ఒక కూలీ కొడుకు దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు కర్ణాటకకు చెందిన మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge). గాంధీ ఫ్యామిలీ నుంచి ఈసారి బరిలో ఎవరూ లేక పోవడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
పార్టీ పరంగా చూస్తే ప్రస్తుతం అంపశయ్యపై కొట్టుమిట్టాడుతోంది. దానికి ఆక్సిజన్ ఇస్తేనే బతికి బట్టకడుతుంది. వచ్చే 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఎప్పుడైతే నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కొలువు తీరిందో ఆనాటి నుంచి కాంగ్రెస్ పార్టీ తన ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చింది.
ఒక రకంగా పార్టీ రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ లేనిరీతిలో ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో పార్టీ పగ్గాలు చేపట్టిన రాహుల్ గాంధీ అస్త్ర సన్యాసం చేశారు. ఆ తర్వాత సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఖర్గే చీఫ్ గా ఎన్నికైన నాటి వరకు కొనసాగారు.
ఒక రకంగా కొండంత బరువుని తాను కోల్పోయానని చెప్పారు ఆమె. ఈ విపత్కర సమయంలో మల్లికార్జున్ ఖర్గే కొలువుతీరారు. కానీ పార్టీని ఎలా మ్యానేజ్ చేయగలరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎవరు గెలిచినా లేదా ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా గాంధీ కుటుంబానికి తెలిసే జరుగుతుందని ప్రచారం జోరందుకుంది.
తాను మేడం సలహాలు స్వీకరిస్తానని కానీ రిమోట్ కంట్రోల్ మాత్రం కానని స్పష్టం చేశారు ఖర్గే. అలా జరగడం గాలిలో దీపం పెట్టడం లాంటిదేనని చెప్పక తప్పదు. అలా అని కొత్త అధ్యక్షుడిని తక్కువ అంచనా వేసేందుకు వీలు లేదు. విస్తృతమైన అవగాహన కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు ఖర్గే.
ఒక రకంగా చెప్పాలంటే మల్లికార్జున్ ను మాస్ లీడర్ గా అభివర్ణిస్తారు. ప్రధానంగా బహు భాషల్లో ప్రావీణ్యం ఉండడం కూడా అదనపు అర్హతగా భావించాల్సి ఉంటుంది. ఖర్గేకు కన్నడ, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, మరాఠ భాషల్లో ప్రావీణ్యం ఉంది. ఇక బీజేపీ మొత్తం మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా త్రయం సారథ్యంలో నడుస్తోంది.
ప్లాన్ వేయడం, అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ కంటే 100 రెట్లు ముందంజలో ఉంది. విస్తృతమైన అనుభవం కలిగిన మల్లికార్జున్ ఖర్గేకు ఇప్పుడు పార్టీని నడపడం కత్తి మీద సాము లాంటిదే. అంతే కాదు బీజేపీని ఢీకొనడంలో మామూలు విషయం కాదు. ఏది ఏమైనా ఖర్గే సక్సస్ అవుతాడా లేక పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే మిగిలి పోతాడా అన్నదే తేలాల్సి ఉంది.
Also Read : మోదీ సర్కార్ ఇలాఖాలో జాబ్స్ నిల్