India Unite Comment : విద్వేష రాజకీయం దేశానికి ప్రమాదం
కావాల్సింది ద్వేషం కాదు మానవత్వం
India Unite Comment : దేశం అట్టుడుకుతోంది. లక్షలాది మంది పోరాడి సాధించుకున్న సమున్నత భారతం ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ప్రాంతం, కులం, మతం, ద్వేషంతో రగిలి(India Unite) పోతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. మనుషుల మధ్య పగలు ప్రతీకారాలు పెచ్చరిల్లి పోయాయి.
ఇక భౌతిక దాడులకు లెక్కే లేకుండా పోయింది. సమాజంలో కీలకంగా ఉన్న మహిళలపై చెప్పుకోలేని రీతిలో అఘాయిత్యాలు, హత్యలు జరుగుతున్నాయి. వీటన్నటి వెనుకాల బలమైన కారణాలు ఉన్నాయి. ఒకటి మనుషుల మధ్య ఆధిపత్య పోరు, అంతరాలు మరింత దూరంగా ఉండేలా చేస్తున్నాయి.
ప్రజలను కలిపి ఉంచేందుకు ఏర్పాటైన మతాలు ఇప్పుడు రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మారాయి. దేశ భవిష్యత్తు మొత్తం పీఠాధిపతులు, స్వామీజీలు, నేరస్థులు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్లు, టైకూన్లు , ఆర్థిక నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లి పోయింది. ప్రస్తుతం ఎన్ని నేరాలు ఎక్కువ చేస్తే అంత గొప్పోళ్లుగా కీర్తించే సమాజం దాపురించింది.
గాంధీ కలలు కన్న శాంతి, నెహ్రూ ఆశించిన సమానత్వ భావన, అంబేద్కర్ కోరుకున్న రాజ్యాంగం ఏవీ 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో సాధించిన దాఖలాలు లేవు. ఆకాశ హార్మ్యాలు, వాహనాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, కళ్లు చెదిరే భవంతులు, పరిశ్రమలు, టెక్నాలజీ ఇవే అభివృద్దికి కొలమానాలుగా కీర్తించబడుతున్నాయి.
విలువలకు పాతరేసి అధికారమే పరమావధిగా చెలామణి అవుతున్న ఈ తరుణంలో భూతద్దం వెతికినా మానవత్వం కనిపించడం లేదు. సాటి మనిషిని ప్రేమించే సహృదయం లేకుండా పోతోంది రోజు రోజుకు. దేశమే(India Unite) కాదు యావత్ ప్రపంచం ఇప్పుడు మార్కెట్ మయంగా, వస్తుమయంగా మారి పోయింది.
ప్రతిదీ రూపాయల్లో లేదా డాలర్లలో కొలిచే సంస్కృతికి దిగజారి పోయింది. అభివృద్ది నమూనా అంటే ఏమిటి. డబ్బులు ఉండటమా లేక అధికారాన్ని చెలాయించడమా లేక దాడులు చేయడమా. కానే కాదు అందరికీ విద్య, వైద్యం, ఉపాధి. సామాజిక భద్రత. ఇవేవీ ఇప్పుడు లేవు. ప్రాథమిక హక్కులు, సామాజిక నీతి సూత్రాలు అన్నీ భారత రాజ్యాంగంలో ఓ మూలకు పడి ఉన్నాయి.
అధికారం, రెడ్ టేపిజం, న్యాయ వ్యవస్థ, మీడియా అన్ని రంగాలు 75 ఏళ్లకే పడుపు కూడు తిని కీర్తించేందుకే సరి పోతున్నాయి. నేరమే అధికారమై చట్టమే చుట్టమై దోచుకోవడమే ప్రాథమిక హక్కుగా మారి..రాజకీయాలకు మతం కేరాఫ్ గా తయారైన ఈ తరుణంలో మానవత్వం గురించి ఆశించడం అంటే గాలిలో దీపం పెట్టి దేవుడా అని మొక్కినట్టే.
ఈ దేశానికి కావాల్సింది ద్వేషం కాదు గుప్పెడు ప్రేమ..కాసింత సాయం చేసే గుణం..మానవత్వం కావాలి. అది లేక పోతే ఎన్ని వనరులు ఉన్నా..ఎంత అధికార, మంద బలం, బలగం ఉన్నా వ్యర్థమే. తస్మాత్ జాగ్రత్త.
Also Read : మంగళూరు పేలుడు వెనుక ఉగ్ర చర్య