Save Farmers Comment : ఆకలిని తీర్చే దేవుళ్లను ఆదుకోలేమా
ఎంతకాలం రైతన్నల ఆగ్రహం..పోరాటం
Save Farmers Comment : జై జవాన్ జై కిసాన్ అన్న మాటలు నినాదాలకే పరిమితమై పోయాయి. సమున్నత భారత దేశంలో కోట్లాది మంది వ్యవసాయ రంగంపై ఆధారపడ్డారు. దీనిని నమ్ముకుని జీవిస్తున్న వారి జీవితాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి.
ఇప్పటికే వ్యవసాయం దండుగ అని ఓ వైపు ప్రచారం చేస్తూనే మరో వైపు దానిని కార్పొరేట్ల పరం చేసే పని జోరుగా సాగుతోంది. ఈ దేశంలో ప్రతిదీ వ్యాపార, వాణిజ్యానికి ముడి పెట్టడం జరుగుతూ వస్తోంది.
ఇది అత్యంత ప్రమాదకరంగా తయారైంది. ఆర్థిక రంగ నిపుణులు సైతం ఎప్పటి నుంచో హెచ్చరిస్తూ వస్తున్నారు. ఉత్పత్తి రంగాన్ని నిర్వీర్యం చేస్తూ కేవలం ప్రైవేట్ జపం చేస్తూ పోతే చివరకు దేశానికి తినేందుకు తిండి గింజలు దొరకవని హెచ్చరిస్తున్నారు.
కానీ పాలకులు తమ ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తున్నారు. బడా వ్యాపారవేత్తలు, బడా బాబులు, కార్పొరేట్ కంపెనీలకు వత్తాసు పలుకుతూ వ్యవసాయ రంగాన్ని సాధ్యమైనంత మేర నాశనం చేయాలని చూస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అన్ని రంగాలు ఇవాళ ప్రమాద స్థితిలోకి నెట్టి వేయబడ్డాయి.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళించిన సమయంలో ప్రతి రంగమూ విల విలలాడింది. కానీ ఒకే ఒక్క రంగం మాత్రం నిటారుగా నిలబడింది. ఆ రంగమే వ్యవసాయ రంగం.
ఇది అనాది నుంచి మనుషులతో, ప్రకృతితో , సమాజంతో, దేశంతో ముడి పడి ఉన్నది. అంతర్లీనంగా ప్రయాణం చేస్తూ వస్తున్నది. కోట్లాది మంది రైతులు, శ్రామికులు, కార్మికులు ఇవాళ వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు.
ఆరుగాలం శ్రమించి పండించే అన్నదాతలకు కనీస గుర్తింపు లేదు. అంతకంటే పంటకు కనీస మద్దతు ధర లభించడం లేదు. దళారులు, వ్యాపారుల జేబుల్లోకి పండించిన పంటలో సగం సరి పోతోంది.
ఇవాళ వ్యవసాయం సాగు అనేది తలకు మించిన భారంగా తయారైంది. ఇప్పటికే కేంద్రంలో కొలువు తీరిన మోదీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సాగు చట్టాలను తీసుకు వచ్చింది.
దీని వల్ల 10 వేల మందికి పైగా రైతులపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కనీసం 100 మందిపై కూడా కేసులు ఎత్తి వేయలేదు. రైతులు(Save Farmers) ఆందోళన దేశాన్ని కదిలించింది. ప్రభుత్వం దిగి వచ్చేలా చేసింది.
చివరకు సాగు చట్టాల బిల్లును వెనక్కి తీసుకుంది. పూర్తిగా రద్దు చేసింది. ఇది పక్కన పెడితే రైతుల పోరాటానికి దిగి వచ్చినా చివరకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది.
కనీసం ప్రజా దేవాలయంగా భావించే పార్లమెంట్ లో చర్చించేందుకు కూడా ఒప్పు కోవడం లేదు ప్రభుత్వం. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం తప్ప మరొకటి కాదు.
తాజాగా ఇదే బీజేపీకి చెందిన అనుబంధ సంస్థ భారతీయ కిసాన్ సంఘ్ సంస్థ కిసాన్ గర్జన పేరుతో భారీ ర్యాలీకి పిలుపు ఇచ్చింది. వేలాది మంది దేశ రాజధానికి తరలి వచ్చారు.
దేశ వ్యాప్తంగా 560 జిల్లాలు, 60 వేల గ్రామ కమిటీల నుండి లక్ష మంది దాకా రైతులు హాజరయ్యారు. వారు కోరుతున్నది కేవలం ఆచరణకు సాధ్యమయ్యేవే. తమ సాగుకు సంబంధించిన పనిముట్లపై జీఎస్టీ ఎత్తి వేయాలని కోరుతున్నారు.
పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని విన్నవిస్తున్నారు. పంట సాయం రూ. 6 వేల నుంచి రూ. 12 వేలకు పంచాలని డిమాండ్ చేస్తున్నారు.
అన్నం పెట్టే అన్నదాతల పట్ల వివక్ష చూపుతున్న సర్కార్ కార్పొరేట్ లు , ఆర్థిక నేరగాళ్లు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను రైటాఫ్ చేసింది. ఇది
ఎంత వరకు న్యాయమో ఆలోచించాలి. బడా వ్యాపారవేత్తలు అన్నం పెట్టరు.
వాళ్లు కంచాల నుంచి అన్నం లాగేసుకుంటారు. ఇకనైనా వ్యవసాయ రంగానికి ఊతం ఇవ్వాలి. ఆకలిని తీర్చే రైతులను ఆదుకోవాలి. లేక పోతే ఆకలి కేకలతో చనిపోయే రోజు దగ్గరలోనే వస్తుంది.
Also Read : కిసాన్ గర్జన భగ్గుమన్న రైతన్న