Tirumala Ugadi : శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్
21, 22న బ్రేక్ దర్శనాలు బంద్
Tirumala Ugadi : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు మార్చి 22న ఉగాది పర్వదినం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేసింది. అయితే పండుగ కావడంతో నిత్యం స్వామి వారికి సమర్పించే ఆర్జిత సేవలు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ , ఆర్జిత బ్రహ్మోత్సవాలను రద్దు చేసినట్లు తెలిపింది. ఇందులో భాగంగా మార్చి 21, 22న వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా ఉండవని స్పష్టం చేసింది టీటీడీ.
ఇక ప్రతి ఏటా వచ్చే ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ఏడాది శ్రీ శోభకృత్ నామ సంవత్సరం. ఉదయం 3 గంటలకు సుప్రభాతం చేపడతారు. 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి విశేష సమర్పణ చేస్తారు. 7 నుంచి 9 గంటల దాకా విమాన ప్రాకారం, ధ్వజ స్తంభం చుట్టూ ఊరేగింపు జరుగుతుంది.
శ్రీవారి మూల విరాట్టుకు , ఉత్సవ మూర్తులకు కొత్త దుస్తులను ధరింప చేస్తారు. అనంతరం యధావిధిగా పంచాంగ శ్రవణం ఉంటుంది. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు చేపడతారు.
మార్చి 21న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం , 22న ఉగాది ఆస్థానం ఉంటుంది. ఈ క్రమంలో ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు గాను వీఐపీ బ్రేకు దర్శనాలు ఉండవని టీటీడీ(Tirumala Ugadi) వెల్లడించింది. ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. భక్తులు సహకరించాలని టీటీడీ కోరింది.
Also Read : ఆస్కార్ కంటే అభిమానం గొప్పది