TSPSC Paper Leak Comment : లీకుల జాతర ప్రతిభకు పాతర
అయోమయం అంతా గందరగోళం
TSPSC Paper Leak Comment : నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెలంగాణ ఉద్యమం మొదలైంది. రాష్ట్రం ఏర్పడి తొమ్మిది ఏళ్లు పూర్తయినా ఈరోజు వరకు పారదర్శకత లేకుండా పోయింది. దేశంలోనే అత్యాధునిక టెక్నాలజీతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొలువు తీరిందంటూ గతంలో దీనికి బాధ్యత వహించిన చైర్మన్ తో పాటు సభ్యులు ప్రకటిస్తూ వచ్చారు.
తొలి చైర్మన్ గా ఘంటా చక్రపాణి సారథ్యంలో పరీక్షలు నిర్వహించినా ఒకే ప్రాంతానికి చెందిన వారు ఎంపికైనట్లు ఆరోపణలు వచ్చాయి. కానీ ఆయన వాటిని ఖండించారు. నోటిఫికేషన్లు వేయడం , కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేయడం , ఆ తర్వాత యధావిధిగా వాయిదా పడడం షరా మామూలై పోయింది. ప్రభుత్వం నియమించిన బిశ్వాల్ కమిటీ భారీ ఎత్తున ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని నివేదిక సమర్పించింది.
గతంలో జిల్లా స్థాయిలో ఎంపిక కమిటీ ఉండేది. కానీ ప్రతి పోస్టును టీఎస్పీఎస్సీ ద్వారానే అప్పగించడం కొలువుల ఎంపికలో తాత్సారం జరుగుతూ వచ్చింది. బీఆర్ఎస్ రెండోసారి పవర్ లోకి వచ్చినా ఉద్యోగాల నియామకాల విషయంలో ఆసక్తి కనబర్చ లేదు. ఎంత సేపు రాజకీయాలు, మద్యం దుకాణాలు, సంక్షేమ పథకాలు, ప్రాజెక్టుల పైనే ఫోకస్ పెట్టింది.
లక్షలాది మంది నిరుద్యోగులు జాబ్స్ కోసం ఎదురు చూస్తూ వచ్చారు. కొందరు ఉద్యోగాలు రావని ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇదే సమయంలో అసెంబ్లీ సాక్షిగా సీఎం 85 వేల పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఆ మేరకు టీఎస్పీఎస్సీకి బి. జనార్దన్ రెడ్డిని చైర్మన్ గా ఎంపిక చేశారు. హడావుడిగా నోటిఫికేషన్లు జారీ చేశారు.
గ్రూప్ -1 పేపర్ లీక్(TSPSC Paper Leak Comment) కావడం కలకలం రేపింది. రేణుక అనే ఆమె కోసం ఇదంతా జరిగిందంటూ చిలుక పలుకులు పలికారు చైర్మన్ . దీనికి సంబంధించి ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేక పోయారు. మంత్రి కేటీఆర్ మాత్రం ఇద్దరే కీలకమని ప్రకటించారు. భారీ ఎత్తున పోస్టులకు సంబంధించి బేరం పెట్టారన్న విమర్శలు ఉన్నాయి.
ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డితో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. 30 మందిని విచారించింది. అంతే కాకుండా టీఎస్పీఎస్సీ చైర్మన్ , సెక్రటరీతో పాటు సభ్యులను ప్రశ్నించింది.
ఇదే క్రమంలో మంత్రి కేటీఆర్ తిరుపతి పేరు కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు ప్రతిపక్ష నాయకులు. మనీ లాండరింగ్ చోటు చేసుకుందని ఆరోపిస్తూ ఈడీ రంగంలోకి దిగింది. ఏప్రిల్ 11న ఈ మొత్తం పరీక్షల లీకుల వ్యవహారానికి సంబంధించి సిట్ నివేదిక సమర్పించనుంది.
ఓ వైపు టీఎస్పీఎస్సీ లో చోటు చేసుకున్న పేపర్ లీకుల(TSPSC Paper Leak) వ్యవహారం ఇలా ఉండగానే మరో ఘటన చోటు చేసుకుంది. పదో తరగతి పరీక్షలకు సంబంధించి తెలుగు, హిందీ పరీక్ష ప్రశ్నాపత్రం లీకు కావడం కలకలం రేపింది.
విద్యా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. వేలాది మంది నిరుద్యోగులు, విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లడం పరిపాటిగా మారింది. మొత్తంగా సిట్ పై తమకు నమ్మకం లేదని కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేపడితేనే అసలు దోషలు బయట పడతారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ , టీజేఎస్ చీఫ్ కోదండరామ్ , వైఎస్సార్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా జవాబుదారీగా ఉండాల్సిన నియామక సంస్థ చివరకు అభాసు పాలవడం దారుణం.
Also Read : లీకేజీల పర్వం ఇంకెంత కాలం