GT vs RR IPL 2023 : రాజస్థాన్ రాజసం గుజరాత్ పరాజయం
3 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ
GT vs RR IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన కీలక పోరులో అద్భుత విజయాన్ని నమోదు చేసింది కెప్టెన్ సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్. చివరి వరకు నువ్వా నేనా అన్న రీతిలో మ్యాచ్ సాగింది.
మొదట్లో తడబడినా ఆ తర్వాత సంజూ చెలరేగితే షిమ్రోన్ హిట్మెయర్ దెబ్బకు గుజరాత్ విల విల లాడింది. దేవదత్ పడిక్కల్ , రవిచంద్రన్ అశ్విన్ కీలక పాత్ర పోషించారు. అవసరమైన సమయంలో గౌరవ ప్రదమైన స్కోర్ సాధించారు. దీంతో రాజస్థాన్ 3 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో వరుసగా టాప్ లో కొనసాగుతోంది.
సమ ఉజ్జీల మధ్య పోరు రసవత్తరంగా , ఆసక్తికరంగా సాగింది. గుజరాత్ టైటాన్స్(GT vs RR IPL 2023) ఆశలపై నీళ్లు చల్లారు శాంసన్ , హెట్మెయర్. చివరి దాకా ఉండి గెలిపించాడు విండీస్ స్టార్. మ్యాచ్ విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్ స్కిప్పర్ సంజూ శాంసన్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
మైదానంలోకి దిగిన గుజరాత్ టైటాన్స్. శుభ్ మన్ గిల్ 34 బంతులు ఆడి 45 రన్స్ చేశాడు. డేవిడ్ మిల్లర్ 30 బంతుల్లో 46 పరుగులతో సత్తా చాటాడు. అభినవ్ మనోహర్ 13 బంతులు ఎదుర్కొని 27 రన్స్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 177 రన్స్ చేసింది.
అనంతరం 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 10 ఓవర్ల వరకు తడబడింది. ఓ వైపు 13 రన్ రేట్ తో గెలుస్తుందో లేదోనని డైలమాలో పడింది. కానీ సంజూ శాంసన్ మొక్కవోని ఆత్మ విశ్వాసంతో కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. 32 బంతుల్లో 60 రన్స్ చేశాడు.
ప్రధానంగా రషీద్ ఖాన్ కు చుక్కలు చూపించాడు. వరుసగా 3 సిక్సర్లతో చావ బాదాడు. నూర్ అహ్మద్ బౌలింగ్ లో సిక్స్ కొట్టబోయి అవుట్ అయ్యాడు. అనంతరం పడిక్కల్, అశ్విన్ అవసరమైన పరుగులు చేయడంలో సపోర్ట్ గా నిలిచారు.
ఇక సంజూ వెనుదిరిగాక జట్టు గెలుపు బాధ్యతను తన భుజాల మీద వేసుకున్నాడు విండీస్ స్టార్ షిమ్రోన్ హెట్మెయర్. 26 బంతులు ఎదుర్కొని 56 రన్స్ చేశాడు. ఆఖరి ఓవర్ కు 7 పరుగులు అవసరం కాగా. తొలి బంతికి 2 రన్స్ చేశాడు. రెండో బంతిని సిక్సర్ గా మలిచాడు. దీంతో ఘన విజయం స్వంతమైంది రాజస్థాన్ కు.
Also Read : ఇషాన్ కిషన్ సెన్సేషన్