మీ టూ నిరసన మరోసారి హాట్ టాపిక్ గా మారింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ , భారతీయ జనతా పార్టీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ ఢిల్లీ లోని జంతర్ మంతర్ లో భారత అగ్రశ్రేణి రెజ్లర్లు నిరసనను పునః ప్రారంభించారు. ఈ ఆరోపణలపై కమిటీ విచారణ చేపడుతుందని హామీ ఇవ్వడంతో ఈ ఏడాది ప్రారంభంలో తమ ఆందోళనను విరమించారు.
తాజాగా బ్రిజ్ భూషణ్ పై పోలీసులు ఫిర్యాదు చేసే వరకు తాము నిరసన స్థలంలోనే ఉంటామని బాధితురాళ్లు ప్రకటించారు. ఒక రకంగా కేంద్రాన్ని హెచ్చరించారు. ఇదలా ఉండగా తాము చేపడుతున్న పోరాటానికి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు ఒలింపిక్ విజేత బజరంగ్ పునియా. బీజేపీ, కాంగ్రెస్ , ఆప్ లేదా మా నిరసనలో చేరేందుకు రావచ్చని, మద్దతు ఇచ్చే వారికి సాదర స్వాగతం పలుకుతున్నామని తెలిపారు.
తాము ఎవరినీ గుడ్డిగా నమ్మే పరిస్థితి లేదని, గతంలో తమను తప్పుదారి పట్టించారని ఆరోపించారు కామన్వెల్త్ , ఆసియా క్రీడల్లో బంగారు పతకం గెలిచిన మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్. ఇదిలా ఉండగా సెంట్రల్ ఢిల్లీ లోని కన్సాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్ లో ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ పై ఏడుగురు మహిళా రెజ్లర్లు లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నాడంటూ రెజ్లర్లు ఆరోపించారు. ఇంకా చర్యలు తీసుకోలేదంటూ వాపోయారు. మేరీ కోమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదికను ఎందుకు బహిరంగ పర్చలేదంటూ ప్రశ్నించారు రెజ్లర్లు.