వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ సోమవారం రెచ్చి పోయారు. పార్టీ ఆఫీసు వద్ద షర్మిలను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఓ వైపు పోలీసులతో వాగ్వాదానికి దిగారు షర్మిల. ఇదే సమయంలో కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నారు. ఆపై ఎస్ఐ పై కూడా దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా జూబ్లీ హిల్స్ స్టేషన్ వద్ద షర్మిల తల్లి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య వైఎస్ విజయమ్మ రెచ్చి పోయారు. తనను అదుపులోకి తీసుకునేందుకు యత్నించిన మహిళా కానిస్టేబుల్ ను తిట్టి పోశారు. ఆపై సహకరించమని కోరినా పట్టించు కోలేదు. ఇదే సమయంలో ఆమె చెంప ఛెల్లుమనిపించారు వైఎస్ విజయమ్మ.
ఇదిలా ఉండగా విధుల్లో ఉన్న పోలీసులపై చేయి చేసుకోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు రజితా రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ సంస్కృతి ఇక్కడ చెల్లుబాటు కాదని తెలుసు కోవాలని హెచ్చరించారు.