కన్నడ నాట యుద్దం ముగిసింది. ఆయుధాలు లేక పోయినా మాటల తూటాలు పేలాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుల ప్రచారంతో హోరెత్తింది. చివరకు ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ వీడింది. పార్టీలు ఏవైనప్పటికీ అంతిమంగా ప్రజలు అంతిమంగా తాము ఎవరికి పవర్ ఇవ్వాలని అనుకున్నారో స్పష్టం చేశారు. విలువైన ఓటు ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మరోసారి పవర్ లోకి రావాలని చేసిన ఏ ప్రయత్నమూ ఫలించలేదు. ఇదే సమయంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. కర్ణాటక విషయంలో జనతాదళ్ సెక్యూలర్ కింగ్ పిన్ గా వ్యవహరిస్తుందని అనుకున్నారంతా. కానీ ఆ పార్టీ 20 సీట్లకే పరిమితం చేశారు.
ఒక రకంగా ఇది గత కొంత కాలంగా బీజేపీ అవినీతి ప్రభుత్వాన్ని ప్రజల్లో వ్యతిరేకత తీసుకు రావడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయ్యింది. ఆ మేరకు అన్నింటా ఆ ప్రభావం చూపింది. ఏకంగా 136 సీట్లు తీసుకు వచ్చేలా చేసింది. ఎన్నికలు ముగిసినప్పటి నుంచి అంచనాలకు మించి తాము సీట్లు గెలుచుకుంటామని స్పష్టం చేశారు కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్. తమ పార్టీ గెలుపొందడం ఖాయమని, ఏ పార్టీతో పొత్తు ఉండబోదంటూ కుండ బద్దలు కొట్టారు మాజీ సీఎం సిద్దరామయ్య. బహుశా ఆ పార్టీ కూడా ఊహించ లేదు తమకు ఇంత భారీ ఎత్తున మెజారిటీ కట్ట బెడతారని.
అధికారం ఉంది కదా అని మిడిసి పడితే, అహంకారాన్ని ప్రదర్శిస్తే, చట్టం ఉంది కదా అని అవినీతి, అక్రమాలకు పాల్పడితే జనం ఊరుకుంటారని అనుకోవడం భ్రమ. ఇదే ఇవాళ వెల్లడైన ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. అంతిమంగా ప్రజలే చరిత్ర నిర్మాతలు అని రుజువు చేశారు. తమతో పెట్టుకుంటే నేల చూపులు చూడాల్సిందేనని స్పష్టం చేశారు. ఓటు అనేది ఆయుధం. దానిని వాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని గుర్తించారు. ఒక రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ చేసుకున్న స్వయం తప్పిదమని చెప్పక తప్పదు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన పొరపాట్లను గుర్తించి, గుణ పాఠంగా మార్చుకుని చాలా ప్రశాంతంగా తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది.
ఆ పార్టీకి అన్నీ తానై వ్యవహరించారు కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్. పార్టీ హై కమాండ్ తో టచ్ లో ఉంటూనే కర్ణాటకలో చక్రం తిప్పారు. అతిరథ మహారథులైన ప్రధాని మోదీ, ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా త్రయానికి చెక్ పెట్టడంలో సక్సెస్ అయ్యారు డీకేఎస్. ఆయన ఇప్పుడు రియల్ టార్చ్ బేరర్ గా మారారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రధాని కర్ణాటకను చుట్టు ముట్టారు. సుడిగాలి పర్యటన చేశారు. అన్నీ తానై వ్యవహరించారు. కోట్ల నిధులు కుమ్మరించారు. లెక్కలేనన్ని హామీలు ఇచ్చారు. కర్ణాటకను దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చి దిద్దుతామని ప్రకటించారు. కానీ వర్కవుట్ కాలేదు. ఈసారి కాంగ్రెస్ పార్టీ పాజిటివ్ వేతో ముందుకు వెళ్లింది. ఇదే ఆ పార్టీకి విజయాన్ని కట్టబెట్టేలా చేసింది.
ఇక ఎప్పటి లాగే బీజేపీ దాని అనుబంధ సంస్థలు కులం, మతం, విద్వేషం, డబుల్ ఇంజన్ నినాదంతో ముందుకు వెళ్లింది. కానీ జనం నమ్మలేదు. చెంప ఛెళ్లుమనిపించారు. కోలుకోలేని రీతిలో దెబ్బ కొట్టారు. మొత్తంగా ఈసారి మల్లికార్జున్ ఖర్గే, సిద్దరామయ్య, డీకే శివకుమార్, రణ్ దీప్ సూర్జేవాలా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కలిసికట్టుగా ముందుకు వెళ్లారు. పార్టీని విజయ పథంలో నడిపించారు. ఇక 40 శాతం కమీషన్ ను తీసుకు వెళ్లడంలో సక్సెస్ అయ్యింది. ఇక బీజేపీ చేసిన తప్పిదాలు ఆ పార్టీ అధికారం కోల్పోవడానికి కారణమైంది. మొత్తంగా ఎవరు గెలిచినా విజయం సాధించింది మాత్రం కన్నడనాట ప్రజలే. ఏది ఏమైనా భారత రాజ్యంగం స్పూర్తికి ఈ గెలుపు ఊపిరి పోసిందని చెప్పక తప్పదు.