Telangana BJP Comment : బీజేపీ ప్రచారం నమ్మని జనం
ఆరోపణలు సరే అరెస్ట్ ఎప్పుడు
Telangana BJP Comment : తెలంగాణ దంగల్ లో త్రిముఖ పోరు నడుస్తోందని భావిస్తోంది భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీకి ఎక్కడా లేనంతగా క్యాడర్ ఉంది. చాప కింద నీరులా విస్తరించింది. ఆక్టోపస్ లా అల్లుకు పోయింది. ఒకానొక దశలో రాష్ట్రంలో ప్రధానమైన పోటీదారుగా ఎదిగింది. కానీ ఉన్నట్టుండి పార్టీ స్టేట్ చీఫ్ గా ఉన్న దూకుడు ప్రదర్శిస్తూ, మాటలతో మంటలు రేపే బండి సంజయ్ కుమార్ ను తప్పించింది. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని తీసుకు వచ్చింది. దీంతో ఆయన నాయకత్వంలో తాము పని చేయలేమంటూ చాలా మంది నాయకులు వెళ్లి పోయారు. వారిలో మాజీ ఎంపీలు గడ్డం వివేక్ వెంకట స్వామి, విజయశాంతి , మాజీ మంత్రి చంద్రశేఖర్ ఉన్నారు. రాష్ట్రంలో సవాలక్ష సమస్యలు పేరుకు పోయి ఉన్నాయి. వాటి గురించి ఊసెత్తిన పాపాన పోలేదు. ఇక ఎలా ప్రత్యామ్నాయంగా ఎదుగుతారని అనుకున్నారో వారే చెప్పాలి. ఇదే సమయంలో ఎలాంటి క్యాడర్ లేని పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తో పొత్తు పెట్టుకోవడం విస్తు పోయేలా చేసింది.
Telangana BJP Comment Viral
ప్రస్తుతం ఈనెలలో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వస్తాయి. ఆరోజే ఏ పార్టీ పవర్ లోకి వస్తుందో తేలి పోనుంది. బీజేపీ ప్రధానమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నది రాష్ట్రంలో కొలువు తీరిన బీఆర్ఎస్ పార్టీ విషయంలోనే. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఒక్కటి అంటూ చేస్తున్న ప్రచారం బెడిసి కొట్టింది. ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంచలన ఆరోపణలు చేశారు సీఎం కేసీఆర్ గురించి. ఇక ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర సర్కార్ అవినీతిపై విచారణ కమీషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా బీజేపీ(BJP) విడుదల చేసిన మేనిఫెస్టో ఏ ఒక్క వర్గాన్ని ఆకట్టుకోలేదని చెప్పక తప్పదు. రాష్ట్రంలో 50 లక్షలకు పైగా నిరుద్యోగులు ఉన్నారు. 2 లక్షలకు పైగా జాబ్స్ ఖాళీగా ఉన్నాయి. కానీ వాటి గురించి ఊసే లేదు.
భారీ ఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నా ఇప్పటి వరకు నోరు మెదపలేదు. రాష్ట్రంలో బీజేపీ(BJP) కంటే బీఎస్పీ అద్భుతంగా వర్క్ చేస్తోంది. ఆ పార్టీ ప్రజా సమస్యల గురించి పోరాడుతోంది. తాజాగా చేవెళ్లలో జరిగిన సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా షాకింగ్ కామెంట్స్ చేశారు. ధరణి పేరుతో కేసీఆర్ భూ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. లిక్కర్ స్కాం కేసులో సీఎం కూతురు కవిత పేరు వినిపించినా ఎందుకు అరెస్ట్ చేయలేక పోయారనే దానిపై బీజేపీ వద్ద , ఆ పార్టీకి చెందిన సీనియర్ల వద్ద సరైన సమాధానం లేకుండా పోయింది. ఇక బీఆర్ఎస్ బాస్ సీఎం కేసీఆర్ సైతం కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ వస్తున్నారే తప్పా బీజేపీని(BJP), ఎంఐఎంలను పల్లెత్తు మాట్లాడటం లేదు. మొత్తంగా బీజేపీ ప్రచారాన్ని జనం నమ్మే స్థితిలో లేరు. ప్రభుత్వ ఓట్లను చీల్చి కేవలం గులాబీ పార్టీకి మేలు చేకూర్చడం తప్పితే ఒరిగేది ఏమీ ఉండదని తేలి పోయింది. ప్రత్యామ్నాయం మాట దేవుడెరుగు పోటీ చేసిన నియోజకవర్గాలలో ఏ మేరకు గెలుస్తుందో వేచి చూడాలి.
Also Read : Nara Lokesh : ఏపీలో మద్య నిషేధం ఎక్కడ