Violence Erupted in Uttarakhand: ఉత్తరాఖండ్‌ లో అల్లర్లు ! ఆరుగురు మృతి !

ఉత్తరాఖండ్‌ లో అల్లర్లు ! ఆరుగురు మృతి !

Violence Erupted in Uttarakhand: ఉత్తరాఖండ్‌ లోని హల్ద్వానీలో అక్రమంగా నిర్మించిన ఓ మదర్సా, దానిని ఆనుకుని ఉన్న మసీదు కూల్చివేత హింసకు దారితీశాయి. కోర్టు ఆదేశాలతో మదర్సా, మసీదు కూల్చివేతకు వెళ్ళిన మున్సిపల్ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, మున్సిపల్ సిబ్బందిపై రాళ్ళు రువ్వారు. అప్రమత్తమైన పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే ఆందోళనకారులు పోలీస్ స్టేషన్ బయట ఉన్న వాహనాలకు నిప్పు పెట్టడంతో హింస వికృతరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో ఒక జేసీబీ మిషన్‌, 70కి పైగా వాహనాలతో పాటు పోలీసు స్టేషన్‌ కు నిప్పుపెట్టారు. ఈ అల్లర్లలో ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందగా మరో 250 మంది వరకు గాయపడ్డారు. గాయపడిన వారిలో పోలీసులు, జిల్లా అధికారులు, మున్సిపాలిటీ సిబ్బంది, జర్నలిస్టులు, స్థానికులు ఉన్నారు.

ఈ నేపథ్యంలో హింస మరింత విస్తరించకుండా ఉండేందుకు ప్రభుత్వం కనిపిస్తే కాల్చివేత ఆదేశాలతో హల్ద్వానీ నగరంలో కర్ఫ్యూ విధించారు. పరిస్థితిని అదుపులోనికి తీసుకువచ్చేందుకు హల్ద్వానీ నగరంలో ఇంటర్నెట్‌ సేవలను పూర్తిగా నిషేధించారు. అల్లర్లు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఉత్తరాఖండ్‌(Uttarakhand) ప్రభుత్వం రాష్ట్రమంతా హైఅలర్ట్‌ ప్రకటించింది.

Violence Erupted in Uttarakhand Viral

ఈ సందర్భంగా నైనిటాల్‌ జిల్లా కలెక్టర్ వందనా సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ… ఆందోళనకారులు ముందస్తు ప్రణాళిక ప్రకారం ఘర్షణలకు పాల్పడ్డారని చెప్పారు. కాగా ఉత్తరాఖండ్‌(Uttarakhand) సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌ లోని బరేలీలోనూ భారీ ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ప్రభుత్వ ముస్లిం వ్యతిరేక విధానాలకు నిరసనగా ‘జైల్‌భరో’ ఆందోళనకు స్థానిక ముస్లిం మతగురువు మౌలానాతౌఫిక్‌ రజా పిలుపునివ్వడంతో ఇస్లామియా బిహారీపూర్‌ మైదానంలోకి వేల సంఖ్యలో జనం చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. హింస నేపథ్యంలో హల్ద్వానీలో ముందు జాగ్రత్త చర్యగా కర్ఫ్యూ విధించారు. ప్రభావిత ప్రాంతాల్లో దుకాణాలు, స్కూళ్లు మూసివేయించారు. పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Also Read : K. V. P. Ramachandra Rao: వైసీపీ ప్రభుత్వంపై కేవీపీ సంచలన వ్యాఖ్యలు !

Leave A Reply

Your Email Id will not be published!