Arvind Kejriwal: నేను అవినీతిపరుడిని అంటే ప్రత్యర్థులు కూడా నమ్మరు – ఆప్ అధినేత కేజ్రీవాల్‌

నేను అవినీతిపరుడిని అంటే ప్రత్యర్థులు కూడా నమ్మరు - ఆప్ అధినేత కేజ్రీవాల్‌

Arvind Kejriwal: ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనను ఓ దొంగగా చిత్రీకరించేందుకు ఆ పార్టీ ప్రయత్నించిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. అందుకే తనను అరెస్టు చేయించిందని అన్నారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రానియా నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న కేజ్రీవాల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘అసలు నేను చేసిన తప్పేంటి ? ఢిల్లీకి పదేళ్లు సీఎంగా ఉండడమే నేను చేసిన తప్పా. పేదల పిల్లలకు మంచి విద్యను ఏర్పాటు చేయడం తప్పా. గతంలో 7 నుంచి 8 గంటలు కరెంటు కోతలు ఉండేవి. కానీ, ఇప్పుడు ఢిల్లీ, పంజాబ్‌ లలో ఉచిత కరెంట్‌ను అందిస్తున్నాం. అందుకోసం రూ.3 వేల కోట్లు ఖర్చు చేశాం. ఆప్‌ ప్రభుత్వం వృద్ధులకు ఉచితంగా ‘తీర్థ యాత్ర’ అందిస్తోంది. అదేనా నేను చేసిన తప్పు..? అవినీతిపరులెవరూ ఇలా చేయరు’’ అని కేజ్రీవాల్‌(Arvind Kejriwal) పేర్కొన్నారు.

‘‘ఒకవేళ నేను అవినీతిపరుడినే అయితే.. ఆ డబ్బంతా నా జేబులోకే వెళ్లేది. అప్పుడు ఇంత అభివృద్ధి కనిపించేది కాదు. నన్ను ఓ దొంగగా చిత్రీకరించాలని బీజేపీ భావిస్తోంది. అందుకే నన్ను జైల్లో పెట్టింది. నా ప్రతిష్ఠను దెబ్బతీయాలని ప్రయత్నిస్తోంది. నేను అవినీతికి పాల్పడలేదని ప్రత్యర్థులూ విశ్వసిస్తారు. జైల్లో ఉన్నప్పుడు నన్ను మానసికంగా, శారీరకంగా దెబ్బతీయాలని చూశారు. నాకు ఇన్సులిన్‌ ఇవ్వకుండా నిలిపివేశారు. నాడు వారు నన్ను ఏం చేయాలనుకున్నారో అర్థం కాలేదు’’ అని కేజ్రీవాల్(Arvind Kejriwal) తీవ్ర ఆరోపణలు చేశారు.

Arvind Kejriwal – నేను అధికారం కోసం ఆరాటపడను – కేజ్రీవాల్

ప్రస్తుతం ప్యూన్‌ ఉద్యోగాన్ని కూడా ఎవరు వదలడం లేదని… కానీ తాను మాత్రం ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేశానని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. తాను అధికారం కోసం ఆరాట పడే వ్యక్తిని కాదని అన్నారు. కాగా.. బెయిల్‌ పై విడుదలైన కేజ్రీవాల్‌ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తాత్కాలిక సీఎంగా మంత్రి ఆతిశీ పేరును ఆప్‌ ప్రకటించింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆతిశీ… పక్కన కుర్చీని ఖాళీగా ఉంచి, ఆమె వేరే సీట్లో కూర్చొని బాధ్యతలు చేపట్టారు.

Also Read : West Bengal: ట్రామ్‌ సర్వీసులకు స్వస్తి చెప్పిన పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం !

Leave A Reply

Your Email Id will not be published!