Siddaramaiah: నేను భయపడేది లేదు విచారణకు సిద్ధం : సిద్ధరామయ్య

నేను భయపడేది లేదు విచారణకు సిద్ధం : సిద్ధరామయ్య

Siddaramaiah: మైసూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) కుంభకోణం కేసులో విచారణను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah) స్పష్టం చేశారు. ఈ విషయంలో తానేమీ భయపడటం లేదని చెప్పారు. ముడా స్కామ్‌పై బెంగళూరు ప్రత్యేక కోర్టు విచారణకు ఆదేశించింది. కర్ణాటక లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తునకు కోర్టు అనుమతించింది. మూడు నెలల్లోగా ముడా స్కామ్‌పై పూర్తిగా దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని మైసూర్‌ పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీఎం తాజాగా స్పందిస్తుా దేనికి నేను భయపడను. విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను. న్యాయపరంగా ఎదుర్కొంటాను అని పేర్కొన్నారు.

Siddaramaiah Comment

ఈ కేసులో సిద్ధరామయ్యకు మంగళవారం హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణానికి సంబంధించి తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి మంజూరుచేయడాన్ని సీఎం హైకోర్టులో సవాల్ చేయగా.. ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. గవర్నర్ థావర్‌చంద్‌ గహ్లోత్‌ చర్యలు చట్టప్రకారం ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఆయన చర్యల్లో ఎలాంటి లోపాలు లేవని, ఈ కేసులో పేర్కొన్న అంశాలు విచారణ చేయాల్సి ఉందని స్పష్టం చేసింది. మరోవైపు సీఎం సిద్ధరామయ్యపై భాజపా విరుచుకుపడింది. ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవించి ముఖ్యమంత్రి స్థానానికి రాజీనామా చేయాలని ఆ పార్టీ నేతలు డిమాండ్‌ చేశారు. ముడా అక్రమాల నేపథ్యంలో ముఖ్యమంత్రిని విచారించేందుకు గవర్నర్‌ గహ్లోత్‌ అనుమతినివ్వడం సబబేనని న్యాయస్థానం స్పష్టం చేసిందని తెలిపారు. కొద్ది నెలలుగా ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలపై నిరంతరం పోరాటం చేస్తున్నామని గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు రుజువులతో సామాజిక కార్యకర్త టి.జె.అబ్రహం గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటు స్నేహమయి కృష్ణ, ప్రదీప్‌కుమార్‌ ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదుల మేరకు ఆగస్టు 16న సీఎంను విచారించాలంటూ గవర్నర్‌ ఆదేశించారు. ఈ ఆదేశాలను రద్దు చేయాలని మంత్రివర్గం తీర్మానించగా దానిని గవర్నర్ తోసిపుచ్చారు. దాంతో సీఎం హైకోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.

Also Read : Minister Ram Mohan Naidu : పీఎం, సీఎం కలిసిన ఏపీ అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు

Leave A Reply

Your Email Id will not be published!