PM Narendra Modi: తహవ్వుర్ రాణా అప్పగింతపై మోదీ పాత పోస్టు వైరల్
తహవ్వుర్ రాణా అప్పగింతపై మోదీ పాత పోస్టు వైరల్
Narendra Modi : ప్రపంచాన్ని వణికించిన ముంబయి ఉగ్రదాడి 26/11 ప్రధాన కుట్రదారుల్లో ఒకడైన తహవ్వుర్ హుస్సేన్ రాణాను ఎట్టకేలకు భారత్ కు తీసుకొచ్చారు. ప్రస్తుతం అతడు ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో తహవ్వుర్ రాణాకేసుకు సంబంధించి గతంలో ప్రధాని మోదీ(Modi) చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతోంది.
14 ఏళ్ల క్రితం చేసిన ఆ పోస్ట్ లో రాణా కేసును ఉద్దేశిస్తూ అప్పటి కాంగ్రెస్(Congress) ప్రభుత్వ దౌత్య విధానాలను మోదీ తీవ్రంగా విమర్శించారు. 2011లో ఈ కేసుపై అమెరికా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ముంబయి దాడుల్లో రాణా ప్రత్యక్ష పాత్ర లేదని తేల్చింది. అయితే, ఆ ఘటనకు కారణమైన ఉగ్ర సంస్థకు అండగా నిలిచాడన్న అభియోగాలపై అతడిని దోషిగా తేల్చింది. ఈ తీర్పుపై 2011 జూన్ 10న ప్రధాని మోదీ ట్విటర్ (ప్రస్తుతం ఎక్స్) వేదికగా స్పందించారు. ‘‘ముంబయి దాడుల ఘటనలో తహవ్వుర్ రాణాను అమాయకుడని యూఎస్ ప్రకటించడం… భారత సార్వభౌమత్వాన్ని అవమానించడమే. మన దేశ విదేశాంగ విధానానికి ఇది భారీ ఎదురుదెబ్బ’’ అని మోదీ ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం రాణా అప్పగింత నేపథ్యంలో ఈ పోస్ట్‌ను నెటిజన్లు షేర్ చేస్తూ… ప్రధాని దౌత్య విధానాలను కొనియాడుతున్నారు. తహవ్వుర్‌ను తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం భారీ విజయాన్ని సాధించిందని ప్రశంసిస్తున్నారు.
Narendra Modi : రాణా అప్పగింతపై స్పందించిన అమెరికా
ముంబయి ఉగ్రదాడి 26/11 ప్రధాన కుట్రదారుల్లో ఒకడైన తహవ్వుర్ హుస్సేన్ రాణా అప్పగింతపై అమెరికా స్పందించింది. ‘‘ఉగ్రదాడుల బాధ్యులకు తగిన శిక్ష పడేలా భారత్ చేస్తున్న ప్రతి పనికి సుదీర్ఘకాలంగా అమెరికా మద్దతు అందిస్తూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పెను సమస్యగా మారిన ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఈ రెండు దేశాలు కలిసి పని చేస్తున్నాయి. ఆ నిబద్ధతను చాటిచెబుతూ తహవ్వుర్ రాణాను అప్పగించాం’’ అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టమ్మీ బ్రూస్ వెల్లడించారు.
Also Read : West Bengal Teachers: పశ్చిమ బెంగాల్ లో రోడ్డెక్కిన మాజీ ఉపాధ్యాయులు