PM Narendra Modi: సౌదీ పర్యటనను అర్ధాంతరంగా ముగించిన ప్రధాని మోదీ ! ఉగ్రదాడిపై ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ భేటీ !
సౌదీ పర్యటనను అర్ధాంతరంగా ముగించిన ప్రధాని మోదీ ! ఉగ్రదాడిపై ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ భేటీ !
PM Narendra Modi : జమ్మూకశ్మీర్ లోని అనంత్‌నాగ్ జిల్లాలో పర్యటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను కుదించుకొని హుటాహుటిన భారత్ చేరుకున్నారు. బుధవారం రాత్రి వరకు ఆయన సౌదీ అరేబియాలోనే ఉండాల్సి ఉండగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) మంగళవారం రాత్రి భారతదేశానికి తిరిగి బయలుదేరి, బుధవారం ఉదయం ఢిల్లీకి వచ్చారు. ఈ ఉగ్రదాడి ఘటన గురించి తెలుసుకున్న ప్రధాని మోదీ సౌదీ అరేబియా ప్రభుత్వం నిర్వహించిన అధికారిక విందుకు కూడా హాజరు కాలేదని, వెంటనే తిరిగి రావాలని నిర్ణయించుకున్నారని ఆయా వర్గాలు తెలిపాయి. బుధవారం ఉదయం ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగిన ప్రధాని మోదీ… విమానాశ్రయంలోనే అత్యవసర సమావేశం నిర్వహించారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీతో భేటీ అయి ఘటన గురించి చర్చించారు. దాడి తీరును వారు ప్రధానికి వివరించారు.
PM Narendra Modi – భారత్ కు తిరుగుపయనమైన సీతారామన్
ఉదయం 11 గంటలకు ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. మరోవైపు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా తన అమెరికా పర్యటనను కుదించుకుని భారత్ కు తిరుగుపయనమయ్యారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీనగర్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. నేడు ఆయన దాడి చోటుచేసుకున్న పహల్గాం ప్రాంతానికి వెళ్లి పరిశీలించనున్నారు.
నేడు పహల్గాంకు అమిత్ షా
ఘటనాస్థలాన్ని సందర్శించాలన్న ప్రధాని మోదీ ఆదేశంతో హోంమంత్రి అమిత్ షా(Amit Shah) హుటాహుటిన మంగళవారం రాత్రి శ్రీనగర్‌కు చేరుకున్నారు. భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. ఆయన వెంట జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హా కూడా ఉన్నారు. బుధవారం అమిత్ షా పహల్గాంకు వెళ్లనున్నారు. ఉగ్రవాదుల దుశ్చర్యపై భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ. వాన్స్ సహా పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Also Read : Pahalgam Terror Attack: నెత్తురోడిన కశ్మీరం ! మినీ స్విట్జర్లాండ్ పహల్గాంలో ఉగ్రదాడి !