Pahalgam Terrorist Attack: ఇది సీమాంతర కుట్రే – సీసీఎస్ సమావేశంలో ప్రధాని మోదీ స్పష్టీకరణ

ఇది సీమాంతర కుట్రే - సీసీఎస్ సమావేశంలో ప్రధాని మోదీ స్పష్టీకరణ

Pahalgam Terrorist Attack : జమ్మూకశ్మీర్‌ లోని అనంత్ నాగ్ జిల్లా పహాల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి(Pahalgam Terrorist Attack) పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఒక నేపాలీ పౌరుడితో పాటు మొత్తం 26 మంది మృతి చెందగా… మరో 20 మందికి పైగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఉగ్రదాడిపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఢిల్లీ(Delhi)లో నిర్వహించిన భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (సీసీఎస్‌) సమావేశం జరిగింది. పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ నరమేధానికి పాల్పడిన ముష్కరులను శిక్షించడంతో పాటు వారిని ఎగదోస్తున్న శక్తులనూ బాధ్యులుగా నిలబెడతామంటూ పాకిస్థాన్‌ను గట్టిగా హెచ్చరించింది. సీమాంతర ఉగ్రవాదాన్ని వీడే వరకూ ఆ దేశం పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. దౌత్య సంబంధాల స్థాయినీ తగ్గించింది. సరిహద్దుల్లో భద్రతా బలగాలను అప్రమత్తం చేసింది. అనంతరం మంగళవారం నాటి ఘటనలో మృతి చెందిన 26 మంది పేర్లను వెల్లడిస్తూ అధికారులు జాబితా విడుదల చేశారు.

ప్రధాని మోదీ(PM Modi) అధ్యక్షతన భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (సీసీఎస్‌) బుధవారం సాయంత్రం ఢిల్లీలోని లోక్‌ నాయక్‌ మార్గ్‌ లో ఉన్న ప్రధాని నివాసంలో సమావేశమైంది. రెండున్నర గంటలకు పైగా కొనసాగిన భేటీలో హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్(Rajnath Singh), విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్, సీనియర్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీసీఎస్‌ భేటీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా పాల్గొనాల్సి ఉంది. ఉగ్రదాడి ఘటన తెలిసిన వెంటనే తన అమెరికా పర్యటనను అర్థంతరంగా ముగించుకుని ఆమె ఢిల్లీకి బయలుదేరారు. మార్గమధ్యంలోనే ఉండడంతో భేటీకి హాజరుకాలేకపోయారు. హోంమంత్రి అమిత్‌ షా పహల్గాం ఘటనను ప్రధాని మోదీకి వివరించారు. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు.

Pahalgam Terrorist Attack – ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు అమిత్‌ షా పరామర్శ

బుధవారం ఉదయం శ్రీనగర్‌లోని పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు తీసుకువచ్చిన 26 మంది మృతదేహాలపై హోంమంత్రి అమిత్‌ షా(Amit Shah) పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. హంతకులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఆ తర్వాత హెలికాప్టర్‌ లో బైసరన్‌ కు చేరుకున్న అమిత్‌ షా… ఉగ్రదాడి జరిగిన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బుధవారం సాయంత్రం అనంతనాగ్‌కు వెళ్లి అక్కడ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అమిత్‌ షా వెంట జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ఉన్నారు.

మృతుల కుటుంబాలకు జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం తరపున రూ. 10లక్షల పరిహారం

ఉగ్రదాడిలో ఆప్తులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2లక్షల చొప్పున, స్వల్పంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున నగదు సహాయం చేయనున్నట్లు వెల్లడించింది.

ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల చేసిన భద్రతా సంస్థలు

పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్నట్లు అనుమానిస్తోన్న ముగ్గురు ఉగ్రవాదుల ఊహా చిత్రాలను భద్రతా సంస్థలు బుధవారం విడుదల చేశాయి. వీరిని ఆసిఫ్‌ ఫౌజి, సులేమాన్‌ షా, అబు తాలాగా గుర్తించారు. మూసా, యూనిస్, ఆసీఫ్‌ అనే మారు పేర్లూ వీరికి ఉన్నట్లు తెలిపారు. వీరిలో ఇద్దరు పాకిస్థాన్‌ జాతీయులని భావిస్తున్నారు.

ఉగ్రవాదులు ఆచూకీ తెలిపిన వారికి రూ.20 లక్షలు నజరానా

పహల్గాంలో 26 మంది పర్యాటకులను దారునంగా హతమార్చిన ముష్కరుల ఆచూకీ తెలిపిన వారికి రూ.20 లక్షల బహుమతి ఇస్తామని జమ్మూకశ్మీర్‌ లోని అనంతనాగ్‌ పోలీసులు ప్రకటించారు. ‘ఈ పిరికిపంద చర్యలో పాల్గొన్న ఉగ్రవాదుల్ని బంధించడానికి, లేదా మట్టుబెట్టడానికి ఉపయోగపడే సమాచారం ఇచ్చేవారికి ఈ రివార్డు అందుతుందని ‘ఎక్స్‌’లో తెలిపారు. ఆచూకీ చెప్పినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. మరోవైపు ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి భద్రతా దళాలు వేటను ముమ్మరం చేశాయి. బుధవారం భారత్‌ లో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ముష్కరులను సైన్యం గుర్తించింది. ఎన్‌ కౌంటర్‌ మొదలైనట్లు వెల్లడించింది. ఉగ్రవాదులు సర్జీవన్‌ అనే ప్రదేశం నుంచి దేశంలోకి ప్రవేశిస్తుండగా ఇది మొదలైంది. ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టినట్లు ఆర్మీ వెల్లడించింది. భారీగా మందుగుండు సామగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.

పహల్గాం ఉగ్రదాడి ఘటనపై గురువారం అఖిలపక్ష భేటీ

పహల్గాం ఉగ్రదాడి ఘటనపై కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిలపక్ష భేటీ నిర్వహించనుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షత వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్‌ సహా పలు ప్రతిపక్షాలు డిమాండ్‌ చేసిన నేపథ్యంలో అఖిలపక్ష సమావేశంపై కేంద్రం నిర్ణయం తీసుకుంది.

Also Read : Supreme Court: జైలు కావాలా ? బెయిల్ కావాలా ? – తమిళనాడు మంత్రికి సుప్రీంకోర్టు ఆఫర్

Leave A Reply

Your Email Id will not be published!