Operation Sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పై తెలంగాణా ప్రొఫెసర్ అభ్యంతకర పోస్ట్

'ఆపరేషన్‌ సిందూర్‌' పై తెలంగాణా ప్రొఫెసర్ అభ్యంతకర పోస్ట్

 

పహాల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా భారత్ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ చేపట్టిన విషయం తెలిసిందే. దీనితో భారత్ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై గాని, భారత్ పై గాని దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని అటు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. దీనికి తోడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్… అటువంటి వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ను ఉద్దేశ్యించి శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత సామాజిక మాధ్యమంలో పెట్టిన ఓ పోస్టు… ఇప్పుడు నెటిజన్లు, రాజకీయ నాయకులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

 

సిందూరం అంటే రక్త సిందూరమా? అంటూ పోస్ట్ చేసిన ప్రొఫెసర్ సుజాత

 

శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత… భారత్ చేట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ను ఉద్దేశ్యించి… ‘‘సిందూరం అంటే రక్త సిందూరం లాంటిదా ? నేనేదో భక్తి, పూజ, శుభానికి సంకేతం అనుకునేదాన్ని… యుద్ధాలు శవాలను, శకలాలను మిగులుస్తాయి కానీ శాంతిని కాదు’’ అంటూ ఆమె తన ఫేస్‌ బుక్‌లో పోస్టు చేశారు. ఈ పోస్ట్ వివిధ సోషల్ మీడియా వేదికలపై వైరల్‌ గా మారింది. దీనితో ఆ పోస్టుపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ను ఎగతాళి చేసిన ప్రొఫెసర్ సుజాత ముమ్మాటికి దేశ ద్రోహేనంటూ బీజేపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను తప్పుబట్టేవిధంగా ఆమె వ్యవహరించిన తీరు దుర్మార్గమని ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ ఓ ప్రకటనలో విమర్శించారు. రాష్ట్ర విద్యాకమిషన్‌ సభ్యురాలిగా ఉండి సుజాత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. తక్షణమే ఆమెను సస్పెండ్‌ చేసి, విద్యా కమిషన్‌ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!