CM Revanth Reddy: ‘తెలంగాణ రైజింగ్-2047’ కు చేయూతనివ్వండి – సీఎం రేవంత్
‘తెలంగాణ రైజింగ్-2047’ కు చేయూతనివ్వండి - సీఎం రేవంత్
CM Revanth Reddy : రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ‘తెలంగాణ రైజింగ్’ పేరుతో తాము చేపట్టిన కార్యక్రమాలకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి(PM Modi) విన్నవించారు. రాష్ట్రంలో పేదల సంక్షేమం, సమగ్ర నూతన విధానాల రూపకల్పన, అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారదర్శక, సుపరిపాలన లక్ష్యాల సాధనకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. వికసిత భారత్ లక్ష్యసాధనలో తెలంగాణ మొదటి వరుసలో నిలుస్తుందని మాట ఇస్తున్నామన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ, ప్రాంతీయ రింగ్ రోడ్డు, రింగ్ రైలు తదితర ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేందుకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ప్రధానితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి దృష్టికి సీఎం పలు కీలక అంశాలను తీసుకెళ్లారు.
CM Revanth Reddy Comments
తెలంగాణ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కులగణన సర్వే నిర్వహించింది. ఇందుకు దేశవ్యాప్తంగా నిపుణుల సూచనలు తీసుకుని ఉత్తమ విధానాలు రూపొందించాం. ఈ సర్వే ఫలితాల ఆధారంగా బీసీలకు ప్రాతినిధ్యాన్ని పెంచే లక్ష్యంతో మా ప్రభుత్వం శాసనసభలో రెండు కీలక తీర్మానాలను ప్రవేశపెట్టింది. అందులో ఒకటి… రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో బీసీలకు సీట్లు, నియామకాలు, రాష్ట్ర సర్వీసుల్లోని పోస్టులు, నియామకాల్లో రిజర్వేషన్ చట్టం-2025. ఇది విద్యా, ఉపాధిలో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తుంది. రెండోది… గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు సీట్ల రిజర్వేషన్ చట్టం. ఇది స్థానిక స్వపరిపాలన సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లను కల్పిస్తుంది. ఈ రెండు బిల్లులను గౌరవ రాష్ట్రపతి ఆమోదానికి కేంద్రానికి నివేదించాం. ఇది తెలంగాణలో సామాజిక న్యాయం సాధనలో కీలక ఘట్టం అని తెలిపార.
సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నీ సమగ్ర, స్థిరమైన అభివృద్ధి సాధిస్తేనే ‘వికసిత భారత్(Vikasit Bharat)’ సాకారమవుతుంది. అందులో భాగంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం మద్దతుగా నిలిచి, వాటి సామర్థ్యాలను ఉపయోగించుకోవడం అత్యవసరం. అదే సమయంలో వెనుకబడిన రాష్ట్రాలకు అన్నిరకాలుగా సాయం చేయాలి. ఈ క్రమంలోనే వికసిత భారత్ కు అనుగుణంగా తెలంగాణ రైజింగ్-2047 కార్యాచరణను మా ప్రభుత్వం చేపట్టింది. మా ఆకాంక్షలు, దృఢ సంకల్పానికి ఈ రోడ్ మ్యాప్ ప్రతిబింబం. ఇంత సాహసోపేత లక్ష్యాల సాధనకు కేంద్ర సహకారం, భాగస్వామ్యం తెలంగాణకు అత్యంత అవసరం అని తెలిపారు.
అంతకు ముందు ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ… ‘‘సంక్షేమం, సుపరిపాలనకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాం. 2047 నాటికి మన దేశాన్ని సూపర్‌పవర్‌గా నిలబెట్టాలన్న మోదీ సంకల్పం స్వాగతించదగింది. కేంద్ర ప్రభుత్వ ‘వికసిత భారత్’ ప్రణాళిక అభినందనీయం. అదే స్ఫూర్తితో మేం ‘తెలంగాణ రైజింగ్-2047’ పేరిట విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించాం’’ అని వెల్లడించారు. ‘‘మన దేశ భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన ఆర్థిక, పాలనాపరమైన ప్రాధాన్యాలపై చర్చించేందుకు ఇక్కడ సమావేశమయ్యాం. ఈ రోజు మనం చేసే చర్చలు దేశ అభివృద్ధి, సంక్షేమంపై దీర్ఘకాల ప్రభావం చూపుతాయి. మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధిలో 2047 నాటికి హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరాల సరసన నిలబెట్టాలనే లక్ష్యంతో తొలి అడుగుగా గత ఏడాదిన్నర కాలంలో అమెరికా, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, దావోస్‌లలో పర్యటించి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించాం. మెట్రో విస్తరణ, ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టులు ప్రస్తుతం ప్రణాళిక దశలో ఉన్నాయి. హైదరాబాద్‌ను డేటాసెంటర్ల హబ్‌గా మారుస్తాం. విద్య, వైద్యంలో నాణ్యమైన సేవలందించేందుకు కృషి చేస్తున్నాం.
CM Revanth Reddy – ఉగ్రవాదంపై పోరుకు సంపూర్ణ మద్దతు – సీఎం రేవంత్
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆపరేషన్ సిందూర్ నిర్వహించినందుకు ప్రధాని మోదీకి(PM Modi), సైన్యానికి అభినందనలు. ఉగ్రవాదంపై పోరులో భాగంగా సాయుధ దళాలు చేపట్టే ప్రతీ చర్యకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో దేశానికి చిరస్మరణీయ విజయం అందించిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దృఢ నాయకత్వాన్ని ఈ సమయంలో గుర్తు చేసుకోవడం సముచితం.
ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ
ట్రిలియన్ డాలర్ల ‘స్థూల జాతీయోత్పతి’(జీఎస్‌డీపీ) సాధించే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నా. రానున్న 15 ఏళ్లలో ఇది సాధ్యమవుతుందని నిపుణుల అంచనా. అయితే, పదేళ్లలోపే లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్పంతో తెలంగాణ ఉంది. గత మూడు దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంత అభివృద్ధి దేశంలోనే అత్యంత వేగంగా ఉంది. ప్రతి ఆరేళ్లకు ఒకసారి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని రెట్టింపు చేసే సామర్థ్యాన్ని స్థిరంగా కొనసాగించాం. ఇదే ఊపుతో ప్రస్తుత దశాబ్దంలోనే తెలంగాణ జీఎస్‌డీపీని ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళతాం.
మహిళా సాధికారికతకు కట్టుబడి ఉన్నాం
మహిళా సాధికారికత… ఆర్థికాభివృద్ధి, సమానత్వం, సామాజిక న్యాయంతో ముడిపడింది. మహిళా సంఘాలకు పెట్టుబడులు సమకూరిస్తే మంచి ఫలితాలు వస్తాయని తెలంగాణ దృఢంగా విశ్వసిస్తోంది. అందుకే ‘ఇందిరా మహిళా శక్తి మిషన్’ను ప్రారంభించాం. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల్ల్లో ప్రస్తుతం 66 లక్షల మంది సభ్యులుండగా కోటికి పెంచడానికి కృషి చేస్తున్నాం. ఈ సంఘాలకు వెయ్యి మెగావాట్ల సోలార్ ప్లాంట్లను కేటాయించాం. వారి ద్వారా 600 బస్సులను రాష్ట్ర ఆర్టీసీకి లీజుకు ఇప్పిస్తున్నాం. పెట్రోల్ పంపు డీలర్‌షిప్‌లను కేటాయిస్తున్నాం. హైదరాబాద్ శిల్పారామంలోని నైట్ బజార్‌లో 106 మహిళా శక్తిబజార్లను ఏర్పాటు చేశాం. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించాం. ఈ క్రమంలో ఇప్పటివరకు రూ.510 కోట్ల విలువైన 27,303 పనులు పూర్తయ్యాయి.
Also Read : Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో పార్ట్-బీకు డీపీఆర్ సిద్ధం