La Ganesan: నాగాలాండ్ గవర్నర్ గణేశన్ కన్నుమూత
నాగాలాండ్ గవర్నర్ గణేశన్ కన్నుమూత
La Ganesan : నాగాలాండ్ గవర్నర్ గణేశన్ కన్నుమూశారు. అనారోగ్యంతో ఇటీవల చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆయన… ఐసీయూలో చికిత్సపొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు రాజ్‌భవన్ అధికారులు వెల్లడించారు. ఆగస్టు 8న చెన్నైలోని తన నివాసంలో కుప్పకూలిన గణేశన్ (80) తలకు గాయం కావడంతో ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. వైద్యులు ఐసీయూలో చికిత్స అందించారు.
La Ganesan No More
1945 ఫిబ్రవరి 16న తంజావూరులో జన్మించిన గణేశన్ (La Ganesan)… చిన్న వయసులోనే ఆరెస్సెస్ భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు. ఆయన తండ్రి, సోదరులకు కూడా ఆరెస్సెస్‌తో సంబంధాలున్నాయి. 1970లో గణేశన్ పూర్తిస్థాయి ప్రచారక్‌గా మారారు. 20 ఏళ్ల పాటు మదురై తదితర ప్రాంతాల్లో సంఘ్‌లో సేవలందించారు. 1991లో బీజేపీలో చేరి తమిళనాడు పార్టీ శాఖ సంస్థాగత కార్యదర్శిగానూ సేవలందించారు. ఆ సమయంలో ఆయన తమిళనాట బీజేపీ బలోపేతానికి కృషిచేశారు. ఆ తర్వాత జాతీయ స్థాయిలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2006 నుంచి 2009 మధ్య కాలంలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ సేవలందించారు.
2016లో మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2021 ఆగస్టులో మణిపుర్ గవర్నర్‌గా నియమితులైన ఆయన… 2023 ఫిబ్రవరి 19వరకు కొనసాగారు. 2022లో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గానూ అదనపు బాధ్యతలు నిర్వహించారు. 2023 ఫిబ్రవరి నుంచి నాగాలాండ్ గవర్నర్‌గా ఉన్నారు.
ప్రధాని మోదీ తీవ్ర విచారం
నాగాలాండ్ గవర్నర్ గణేశన్ మృతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. గణేశన్ నిజమైన జాతీయవాది అని, ప్రజాసేవ, జాతి నిర్మాణానికి తమ జీవితాన్ని అంకితం చేశారని ప్రధాని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. తమిళనాడులో బీజేపీ బలోపేతానికి ఎంతో కృషి చేశారని, తమిళ సంస్కృతిని ఆయన ఎంతగానో ఇష్టపడేవారని అన్నారు. గవర్నర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గణేశన్ మృతి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని నాగాలాండ్ ఉప ముఖ్యమంత్రి యంతుంగో పాటన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఆయన ఎంతో హుందాగా వ్యవహరించేవారని, నిరంతరం ప్రజాసంక్షేమానికి కట్టుబడి పనిచేశారని గుర్తుచేసుకున్నారు.
Also Read : Governor Abdul Nazeer: ఏపీ రాజ్‌భవన్ లో ఆహ్లాదకరంగా ఎట్ హోం !
