Fevikwik : విద్యార్థుల కళ్లల్లో ఫెవిక్విక్ వేసిన స్నేహితులు
విద్యార్థుల కళ్లల్లో ఫెవిక్విక్ వేసిన స్నేహితులు
Fevikwik : ఒడిశాలోని కందమాల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ హాస్టల్ లో ఆకతాయి విద్యార్థి చేష్టలు తోటి విద్యార్థుల ప్రాణాలమీదకు తెచ్చాయి. హాస్టల్ లో నిద్రిస్తున్న సమయంలో స్నేహితుల కళ్లల్లో ఓ విద్యార్థి ఫెవిక్విక్‌ను (Fevikwik) చల్లడం కలకలం రేపింది. దీంతో ఎనిమిది మంది విద్యార్థులు కంటిచూపు సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
Fevikwik Sensational
ఫుల్బానీలోని సాలగూడ సేవాశ్రమ పాఠశాల హాస్టల్‌లో ఉండే విద్యార్థుల్లో ఓ ఎనిమిది మంది శుక్రవారం ఉదయం లేచేందుకు ప్రయత్నించగా వారి కళ్లు తెరచుకోవడం లేదని గుర్తించారు. విషయాన్ని గుర్తించిన సిబ్బంది బాధిత విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఓ విద్యార్థి కళ్లు తెరవగా, మరో ఏడుగురు చికిత్సకు స్పందించలేదు. దీంతో వారిని ఫుల్బానీలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు.
పరిశీలించిన వైద్యులు విద్యార్థుల కళ్లు దెబ్బతిన్నట్లు గుర్తించారు. అయితే, సకాలంలో తీసుకురావడంతో తదుపరి తీవ్ర పరిణామాలకు దారితీయకుండా నివారించినట్లు చెప్పారు. ఓ విద్యార్థి పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉందన్నారు. ముందురోజు రాత్రి ఫెవిక్విక్ తెచ్చుకున్న ఓ విద్యార్థి ఈ చర్యలకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన అధికారులు స్కూల్ హెడ్‌మాస్టర్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. హాస్టల్‌లో ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు, సిబ్బంది పాత్రపైనా పూర్తిస్థాయి దర్యాప్తునకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
Also Read : Quadruplets: మూడో కాన్పులో నలుగురికి జన్మనిచ్చిన మహిళ
