హైదరాబాద్ : హైదరాబాద్ లోని చెరువుల్లోకి మురుగు నీరు భారీగా వచ్చి చేరుతోంది. చెరువులు దుర్గంధ భరితంగా మారాయి. గుర్రపు డెక్క వ్యాపించి దోమలకు కేంద్రాలుగా నగరంలోని చెరువులు మారాయి. హైడ్రా అభివృద్ధి చేస్తున్న చెరువుల జాబితాలో మా ప్రాంత చెరువును కూడా చేర్చాలని హైడ్రా నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో నగరం నలుమూలల నుంచి విన్నాపాలు వచ్చాయి. చెరువులు, నాలాలు ఆక్రమణకు గురి కాకుండా చూసి వరదలు నివారించాలని పలువురు విజ్ఞప్తి చేశారు 28 మందితో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నేరుగా మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. మురుగు నీరు కలవకుండా ఎస్టీపీలు ఏర్పాటు చేయాలని సూచించారు. రామంతాపూర్ చిన్న చెరువు ఎప్టీఎల్ పరిధిలో నిర్మాణాలు జరుగుతున్నాయని వెంటనే వీటిని ఆపి చెరువును కాపాడాలని స్థానికంగా ఉన్న ఓ మహిళ ఫోను చేసి కోరారు. బాచుపల్లి సర్వే నంబరు 54 లో 3 ఎకరాల వరకూ భూమి ప్రొహిబిటెడ్ జాబితాలో ఉందని, దీనిని ప్రజావసరాలకు ఉపయోగపడేలా చూడాలని మరో వ్యక్తి కోరారు.
ఓల్డ్ అల్వాల్, జొన్నబండలోని వజ్ర ఎన్‌క్లేవ్‌లో పార్కుల ఆక్రమణతో పాటు రహదారి ఆటంకాలను తొలగించాలని అక్కడి కాలనీ ప్రతినిధులు కోరారు, ఎల్బీనగర్లోని వాంబే ఇళ్లు పొందిన కింది పోర్షన్ వారు వాహనాలకు పార్కింగ్ కోసం ఉంచిన స్థలాలను కలిపి అదనపు గదులు నిర్మిస్తున్నారని, వెంటనే వాటిని తొలగించి నివాసితుల అందరి వినియోగంలోకి తీసుకు రావాలని కోరారు. హెచ్ఏఎల్ కాలనీలోని ఖర్మన్కుంటలో మురుగు నీరు చేరి గుర్రపు డెక్క పెరుగుతుంది అభివృద్ధి చేయాలని సూచించారు. నిజాంపేటలోని హిల్‌కౌంటీలో పత్తికుంటకు నాలుగు వైపులా రహదారులున్నాయని , దుర్గంధంతో నిండిన ఈ చెరువును అభివృద్ధి చేస్తే అందరికీ వినియోగంలోకి వస్తుందన్నారు. నల్లగండ్లలోని నల్లగండ్ల చెరువును అభివృద్ధి చేయాలని కోరారు. లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థకు ఉద్దేశించిన భూమిలో అక్రమ పార్కింగ్ దందా కొనసాగుతోందని ఫిర్యాదు చేశారు.
