తిరుపతి : నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆరవ రోజు రాత్రి స్వామి వారు శ్రీనివాస దర్బార్ అలంకారంలో గజ వాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. గజ వాహనంపై రాజసంగా విహరించిన స్వామి వారిని దర్శించుకుని భక్తులు పరవశించి పోయారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఉజ్వలంగా తీర్చి దిద్దుతున్నాయి.
ఆర్తత్రాణ పరాయణుడైన భగవంతుడు భక్తుల పిలుపుకు వెంటనే స్పందించి రక్షిస్తాడనే సందేశాన్ని గజ వాహనోత్సవం తెలియ జేస్తుంది. సర్వం విడిచి తననే శరణు వేడిన గజేంద్రుడిని రక్షించినట్లే, తనను విశ్వసించి శరణాగతి పొందిన భక్తులందరికీ అభయాన్ని ప్రసాదిస్తాననే దివ్య సందేశాన్ని స్వామి వారు గజ వాహన సేవ ద్వారా అందించారు. బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజైన బుధవారం ఉదయం 7.30 గంటలకు సూర్యప్రభ వాహనంపై, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, తిరుమల బొక్కసం ఇన్చార్జి శ్రీ గురురాజస్వామి, సూపరింటెండెంట్ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు నాగరాజు, చెంగల్రాయులు, ఆలయ అర్చకులు, అధికారులు, శ్రీవారి సేవకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
