కేంద్రం నిర్ణ‌యం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి తీవ్ర న‌ష్టం

బాక్సైట్ గా పరిగ‌ణించాల‌ని కోరిన ముఖ్య‌మంత్రి

అమ‌రావ‌తి : లాటరైట్ మైన్ వర్గీకరణలో జరిగిన మార్పులపై కేంద్ర గనుల శాఖా మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. లాటరైట్‌లో అల్యూమినియం శాతం 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, దాన్ని ఉప ఖనిజంగా కాకుండా బాక్సైట్ గా పరిగణించాలంటూ ఇటీవల కేంద్రం ఉత్తర్వులు జారీ చేయ‌డాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మార్పుల వల్ల ఏపీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను లేఖలో పేర్కొన్నారు. కేంద్రం నిర్ణయం వల్ల ఏపీలో గనుల లీజుల ప్రక్రియ స్తంభించి పోయిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కొత్త నిబంధనలతో గతంలో మైనర్ మినరల్ కింద ప్రాసెస్ చేసిన 402 గనుల లీజు దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టిందని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లారు ముఖ్యమంత్రి.

నిలిచి పోయిన వాటిలో 19 లెటర్ ఆఫ్ ఇంటెంట్ దరఖాస్తులు, 113 ప్రభుత్వ భూముల దరఖాస్తులు, 255 అటవీ భూముల దరఖాస్తులు, 15 పట్టా భూముల దరఖాస్తులు ఉన్నాయని వెల్ల‌డించారు. పాత నిబంధనల మేరకు అప్లికేషన్ ఫీజులు, భూముల కొనుగోళ్లు, అటవీ అనుమతుల కోసం వందలాది మంది దరఖాస్తుదారులు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని లేఖలో తెలిపారు. గతంలో మైకా, క్వార్ట్జ్, ఫెల్డ్‌స్పార్, బారైట్స్ ఖనిజాలను మైనర్ నుంచి మేజర్ ఖనిజాలుగా మార్చినప్పుడు కేంద్రం సేవింగ్ క్లాజ్ ఇచ్చిందని లేఖలో గుర్తు చేచారు నారా చంద్రబాబు నాయుడు.

ఇప్పుడు అదే తరహాలో లాటరైట్ ఖనిజానికి కూడా సేవింగ్ క్లాజ్ ఇచ్చి, పెండింగ్‌లో ఉన్న 402 దరఖాస్తులను పాత రూల్స్ కిందనే ప్రాసెస్ పూర్తి 2 ఏళ్లు వెసులుబాటు ఇవ్వాలని కోరారు. సడలింపు ఇస్తే వందలాది మంది దరఖాస్తుదారులకు ఆర్థిక నష్టం తప్పుతుందని, కోర్టు వివాదాలు రావని లేఖలో వివ‌రించారు. సేవింగ్ క్లాజ్ అమలు చేస్తే సిమెంట్, ఐరన్ ఓర్, రోడ్డు నిర్మాణ పరిశ్రమలకు ముడిసరుకు కొరత లేకుండా ఉపాధి నిలబడుతుందని స్ప‌ష్టం చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!