రూ.62.20 కోట్ల సబ్సిడీతో పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ

వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

అమరావతి : రైతు సంక్షేమం, భూసార పరిరక్షణ, సుస్థిర వ్యవసాయాభివృద్ధికి రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఖరీఫ్–2026 సీజన్‌లో పచ్చిరొట్ట పంటల సాగును విస్తృతంగా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా తీర్చిదిద్దే లక్ష్యంతో రైతులకు అవసరమైన మద్దతు అందిస్తోందని పేర్కొన్నారు. పచ్చిరొట్ట పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ.62.20 కోట్ల సబ్సిడీని కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 91,918 క్వింటాళ్ల విత్తనాలను జిల్లాలకు కేటాయించగా, అందులో జీలుగ 50,311 క్వింటాళ్లు, జనుము 21,291 క్వింటాళ్లు, పిల్లి పెసర 20,316 క్వింటాళ్లు ఉన్నాయని తెలిపారు.

ఇప్పటికే 40,459 క్వింటాళ్ల విత్తనాలను జిల్లాలకు సరఫరా చేయగా, 19,667 మంది రైతులకు 5,687 క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేసి రూ.4.76 కోట్ల సబ్సిడీ ప్రయోజనాన్ని అందించినట్లు చెప్పారు.పచ్చిరొట్ట పంటలు నేల ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి వివరించారు. ఈ పంటలను భూమిలో కలపడం ద్వారా సేంద్రియ కార్బన్ శాతం పెరగడంతో పాటు నత్రజని నిల్వలు అధికమవుతాయని తెలిపారు. దీనివల్ల రసాయన ఎరువులపై ఆధారపడటం తగ్గి, రైతుల సాగు వ్యయం నియంత్రణలో ఉండటమే కాకుండా భూముల ఉత్పాదకత కూడా గణనీయంగా పెరుగుతుందని పేర్కొన్నారు. సహజ, సేంద్రియ వ్యవసాయ విధానాల పట్ల రైతుల్లో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో పచ్చిరొట్ట సాగుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తోందన్నారు. గ్రామ స్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ పంటల ప్రాముఖ్యతను వివరిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ప్రోత్సాహానికి రైతుల నుంచి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!