టీటీడీ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు పటిష్ట చర్యలు

33 విద్యాసంస్థల్లో అడ్మిషన్లకు సమగ్ర ఏర్పాట్లు

తిరుపతి : విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనే సంకల్పంతో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 33 విద్యాసంస్థల్లో 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని టీటీడీ జేఈవో (వైద్యం, విద్య) డాక్టర్‌ ఎ.శరత్‌ అధికారులను ఆదేశించారు. అలిపిరిలోని ఎస్వీబీసీ కార్యాలయం నుండి టీటీడీ డీఈవో వెంకటసునీల్‌తో కలిసి కళాశాలల ప్రిన్సిపల్స్‌, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు

ఈ సందర్భంగా జేఈవో డాక్టర్‌ ఎ.శరత్‌ మాట్లాడుతూ ఆలయాల నిర్వహణతో పాటు విద్యా రంగానికీ సమాన ప్రాధాన్యతనిస్తూ టీటీడీ ఏడు దశాబ్దాలుగా విశిష్ట సేవలు అందిస్తోందన్నారు. తిరుపతితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యాసంస్థలను విజయవంతంగా నిర్వహిస్తూ వేలాది మంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతోందని పేర్కొన్నారు. విద్య ద్వారా యువతలో ఉపాధి అవకాశాలతో పాటు సామాజిక బాధ్యత, నైతిక విలువలు, ఉత్తమ వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతాయని వివరించారు.

టీటీడీ విద్యాసంస్థల్లో ప్రవేశాల ప్రక్రియను మెరిట్‌, పారదర్శకత, జవాబుదారీతనం అనే మూడు ప్రధాన సూత్రాల ఆధారంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని జేఈవో తెలిపారు. అడ్మిషన్ల నిర్వహణ కోసం ప్రతి విద్యాసంస్థలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, విద్యార్థులు , తల్లిదండ్రులకు అవసరమైన మార్గదర్శకత్వం అందించేందుకు హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రవేశాల ప్రక్రియ పూర్తిగా మెరిట్‌ ఆధారంగా, పారదర్శకంగా జరగాలని స్పష్టం చేశారు.

కోర్సుల వారీగా సీట్ల లభ్యత, ఖాళీల భర్తీ, స్పాట్‌ అడ్మిషన్ల నిర్వహణ వంటి అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. అడ్మిషన్‌ ఫీజులను పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలోనే స్వీకరించాలని, విద్యార్థుల సౌకర్యార్థం అవసరమైన సూచిక బోర్డులు, సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.శ్రీ వేంకటేశ్వర శిల్పకళాశాల, బాలమందిరం, బధిరుల పాఠశాల తదితర ప్రత్యేక విద్యాసంస్థల అడ్మిషన్లకు సంబంధించిన సమాచారాన్ని ప్రకటనలు, ఫ్లెక్సీలు, డిజిటల్ , సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి ప్రతి విద్యార్థికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Leave A Reply

Your Email Id will not be published!