భారత సైన్యానికి తొలి విడతగా 41 జేకే 250ఈ డ్రోన్లు

రూ 72 కోట్ల రక్షణ ఒప్పందంలో కీలక మైలురాయి

హైద‌రాబాద్ : భారతీయ రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికత అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తూ డ్రోగో ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో డ్రోగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్) భారత సైన్యానికి 41 జేకే 250ఈ డ్రోన్లను తొలి విడతగా అంద చేసింది. మొదటి బ్యాచ్ డ్రోన్లను నాసిక్ లో ఉన్న సథరన్ కమాండ్ అధికారులు అందుకున్నారు. భారత సైన్యం నుంచి లభించిన మొత్తం రూ 72 కోట్ల విలువైన ఈ ఆర్డర్‌లో మిగిలిన డ్రోన్ల సరఫరాను ఈ ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా దేశ రక్షణ ఆధునీకరణకు, కేంద్ర ప్రభుత్వ ‘మేక్ ఇన్ ఇండియా’ , ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమాలకు సంస్థ తన వంతు సహకారం అందిస్తోంది. ఈ తొలి దశ డెలివరీ పూర్తి కావడం సంస్థ అభివృద్ధి గమనం లోనే కాక దేశీయ రక్షణ తయారీ రంగంలో కూడా ఒక కీలక మైలురాయిగా నిలిచినట్లు విడుదల చేసిన ప్రకటనలోడ్రోగో ఏరోస్పేస్ తెలిపింది. డ్రోగో ఏరోస్పేస్ తయారు చేసిన ఈ ఆధునిక డ్రోన్లు ఒకసారి ఛార్జింగ్ చేస్తే మూడు గంటలు ఆకాశంలో ఎగురుతాయి. నిఘాకు, ఇతర సైనిక అవసరాలకు ఉపయోగ పడతాయి.

హైదరాబాద్‌లోని మాదాపూర్ కేంద్రంగా పని చేస్తున్న డ్రోగో డ్రోన్స్ సంస్థ ఇటీవల తన పేరును డ్రోగో ఏరోస్పేస్ గా మార్చింది. డ్రోన్ తయారీ సంస్థ నుంచి సమగ్ర రక్షణ, విమానాలు, ఉపగ్రహాలు, డ్రోన్లు, అంతరిక్ష నౌకల రూపకల్పన, తయారీ, నిర్వహణకు తోడ్పడే మొత్తం సాంకేతిక, పారిశ్రామిక, పరిశోధనా కేంద్రం (ఏరోస్పేస్ టెక్నాలజీ ఎకోసిస్టమ్‌)గా అభివృద్ధి చెందింది. రక్షణ, నిఘా , తదుపరి తరం మానవరహిత వైమానిక వ్యవస్థల అభివృద్ధిపై సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ యశ్వంత్ బొంతు మాట్లాడారు. దేశంలో ప్రముఖ స్వదేశీ ఏరోస్పేస్, రక్షణ సాంకేతిక సంస్థగా ఎదగడమే డ్రోగో ఏరోస్పేస్‌గా రూపాంతరం చెందడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం అని అన్నారు. డ్రోన్ తయారీ, సేవలకే పరిమితం కాకుండా, భవిష్యత్ రక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో కూడిన రక్షణ వ్యవస్థలను తమ సంస్థ అభివృద్ధి చేస్తోంది అని చెప్పారు. భారత సైన్యానికి తొలి విడతగా 41 జేకే 250ఈ డ్రోన్లను విజయవంతంగా అందించడం త‌మ‌ సంస్థకు గర్వకారణం. ఇది మా సాంకేతిక నైపుణ్యం, తయారీ సామర్థ్యం, నాణ్యత ప్రమాణాలు, దేశ సేవ పట్ల మా అంకితభావానికి నిదర్శనం అన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!