హైదరాబాద్ : డ్రోగో ఏరోస్పేస్ సంచలనంగా మారింది. అంకుర సంస్థగా ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పుడు వందలాది మందికి ఉపాధిని ఇచ్చే కంపెనీగా ఎదిగింది. దేశంలో అత్యంత కీలకమైన రక్షణ రంగ వ్యవస్థకు డ్రోన్లను సరఫరా చేసేంత దాకా వెళ్లింది. ఇదిలా ఉండగా డ్రోగో ఏరో స్పేస్ ప్రస్తుతం పలు అత్యాధునిక స్వదేశీ రక్షణ, ఏరోస్పేస్ ప్లాట్‌ఫారమ్‌ల అభివృద్ధిపై పని చేస్తోంది. వాటిలో లోయిటరింగ్ మ్యూనిషన్స్ , దీర్ఘకాలిక సామర్థ్యం కలిగిన యూఏవీలు , కృత్రిమ మేధస్సు ఆధారిత వైమానిక ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్‌లు, అధునాతన నిఘా , రికానైసెన్స్ వ్యవస్థలు, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన ఏరోస్పేస్ ఉత్పత్తులు ముఖ్యమైనవి. దేశ భద్రతా అవసరాలకు అనుగుణంగా స్వదేశీ సాంకేతికతతో రూపకల్పన చేసి, తయారు చేసిన పరిష్కారాలను అందించడం సంస్థ ప్రధాన లక్ష్యంగా పేర్కొంది.
భారత ప్రభుత్వం స్వదేశీ రక్షణ ఉత్పత్తి, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, దేశీయ పరిశ్రమల ప్రోత్సాహంపై ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో డ్రోగో ఏరోస్పేస్ పురోగతి స్ఫూర్తిదాయకంగా నిలవనుంది. సంస్థ విజయాలు దేశ భద్రతను బలోపేతం చేయడమే కాకుండా, ఉపాధి అవకాశాల సృష్టి, సాంకేతిక ఆవిష్కరణలు, స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి కూడా దోహద పడనున్నాయి. భారత సైన్యానికి సంబంధించిన కీలక ఆర్డర్‌ను విజయవంతంగా అమలు చేయడం ద్వారా డ్రోగో ఏరోస్పేస్, అత్యాధునిక మానవరహిత వైమానిక వ్యవస్థల రూపకల్పన, తయారీ , సరఫరా సామర్థ్యాలను నిరూపించుకుని, భారతదేశంలో ఎదుగుతున్న ప్రముఖ రక్షణ సాంకేతిక సంస్థలలో ఒకటిగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో డ్రోన్ల తయారీకి తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లో నాగున్నర ఎకరాల భూమిని డ్రోగో ఏరోస్పేస్ కు కేటాయించింది. అక్కడ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్ తయారీ కేంద్రాన్నిసంస్థ నిర్మిస్తోంది. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మిస్తున్నట్లు సంస్థ సిఈఓ యశ్వంత్ బొంతు తెలిపారు. ఇప్పటికే తమ సంస్థ లో 300 మంది పని చేస్తున్నారని, నూతన తయారీ కేంద్రం లో మరో ఐదు వందల మందికి ఉపాధి లభిస్తుందని ఆయన తెలిపారు. తమ సంస్థను మరింత విస్తరించే ప్రణాళికలో ఉన్నట్లు ప్రకటించారు.
