కారకాస్ : దక్షిణ అమెరికా దేశమైన వెనెజువెలాను వరుస భారీ భూకంపాలు వణికించాయి. స్థానిక కాలమానం ప్రకారం రెండు శక్తివంతమైన భూకంపాలు కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలో సంభవించాయి. మొదటి భూకంపం తీవ్రత 7.2గా నమోదవగా, వెంటనే 7.5 తీవ్రతతో మరో భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలతో రాజధాని కారకాస్‌తో పాటు పలు రాష్ట్రాల్లో భవనాలు కుప్పకూలాయి. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అమెరికా భూగర్భ సర్వే సంస్థ (USGS) ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ విపత్తులో మృతుల సంఖ్య 10 వేల నుంచి లక్ష వరకు చేరే ప్రమాదం ఉందని హెచ్చరించింది. భారీ ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది.
భూకంపాల ప్రభావంతో అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. రహదారులు దెబ్బతిన్నాయి. విద్యుత్, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు గాయపడిన వారి సంఖ్య పెరుగుతుండగా, పలువురు గల్లంతైనట్లు సమాచారం. భూకంపం అనంతరం తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, అనంతరం వాటిని ఉప సంహరించుకున్నారు. వెనెజువెలా ప్రభుత్వం దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించి అంతర్జాతీయ సహాయాన్ని కోరింది.
