తెలంగాణ ప్రాజెక్టుల‌కు ఏపీ ఎన్‌వోసీ ఇవ్వాల్సి ఉంది

స్ప‌ష్టం చేసిన ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : ఉమ్మ‌డి రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాజెక్టులకు ఏపీ నిర‌భ్యంత‌ర ప‌త్రాలు (ఎన్‌వోసీ) ఇవ్వాల్సి ఉంద‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విష‌యంపైనా కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌, ఏపీ ముఖ్య‌మంత్రి చ‌ర్చించామ‌న్నారు. వారు సూత్ర‌ప్రాయంగా అంగీక‌రించార‌ని, ఎన్‌వోసీలు వ‌స్తే వాటికి ఉన్న అడ్డంకులు తొల‌గి పోతాయ‌ని సీఎం అన్నారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు సంబంధించి 150-151 అడుగుల్లో నిర్మించేందుకు మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఫ‌డ్న‌వీస్‌తో భేటీ అవుదామ‌ని ఎంపీల‌తో సీఎం చెప్పారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి బెంగ‌ళూరు, చెన్నై, ముంబ‌యిల‌కు వెళ్లే బుల్లెట్ రైళ్ల‌కు సంబంధించి ఎలైన్‌మెంట్లు కొలిక్కి వ‌చ్చాయ‌ని సీఎం తెలిపారు. ఆదిలాబాద్ ఢిపెన్స్ ఎయిర్‌పోర్ట్‌, వ‌రంగ‌ల్ ఎయిర్‌పోర్ట్‌ల‌కు అవ‌స‌ర‌మైన భూ సేక‌ర‌ణ పూర్తి చేశామ‌ని సీఎం తెలిపారు. ఈ ఎయిర్‌పోర్టుల్లో ఎంఆర్‌వో (మెయింటెనెన్స్‌, రిపేర్స్‌, ఓవ‌ర్ హాలింగ్‌), ఎయిర్ కార్గోలు ఏర్పాటు చేయాల‌ని కోరుతున్నామ‌ని అన్నారు. ఈ విష‌యం పైనా ఎంపీలు దృష్టి సారించాల‌ని సీఎం కోరారు.

రాష్ట్ర ప్ర‌యోజనాలే ల‌క్ష్యంగా కేంద్ర ప్ర‌భుత్వంతో స‌హ‌క‌రిస్తున్నామ‌ని రేవంత్ రెడ్డి తెలిపారు. పార్టీల‌కు అతీతంగా ఎంపీలకు అవ‌స‌ర‌మైన స‌మాచారం అందించ‌డానికి ఢిల్లీ తెలంగాణ భ‌వ‌న్‌లో కోఆర్డినేష‌న్ కు ఐఏఎస్ అధికారి అద్వైత్ కుమార్ సింగ్‌ను నియ‌మించామ‌ని సీఎం చెప్పారు. పెండింగ్ అంశాల‌కు సంబంధించి ఏ స‌మాచారం కావాలన్నా ఎంపీలు ఆయ‌న ద‌గ్గ‌ర నుంచి తీసుకోవ‌చ్చ‌ని సూచించారు. పార్టీలతో సంబంధం లేకుండా ఎంపీలు అడిగే స‌మాచారం వేగంగా వారికి అంద‌జేయాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు. అన్ని పార్టీల ఎంపీల‌ను స‌మ‌న్వ‌యం చేసుకొని ముందుకు సాగాల‌ని ఎంపీల క‌న్వీన‌ర్ డాక్ట‌ర్ మ‌ల్లు ర‌వికి సీఎం సూచించారు.

స‌మావేశంలో ఎంపీలు అడిగిన ప్ర‌తి స‌మాచారం అంద‌జేయాల‌ని ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క అధికారుల‌ను ఆదేశించారు. స‌మాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా తాము కేంద్ర ప్ర‌భుత్వంతో స‌హ‌కార ధోర‌ణితోనే ముందుకు సాగుతున్నామ‌ని తెలిపారు. రాష్ట్రానికి చెందిన వివిధ‌ అంశాల‌కు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వానికి గ‌తంలో పంపిన లేఖ‌లు, ప్ర‌స్తుత స్థితిని తెలియ‌జేస్తూ లేఖ‌లు సిద్ధం చేసి పార్ల‌మెంట్ స‌మావేశాల స‌మ‌యంలో ఎంపీల‌కు అందుబాటులో ఉంచాల‌ని ఉప ముఖ్య‌మంత్రి స్ప‌ష్టం చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!