న్యూఢిల్లీ : సంయుక్త కిసాన్ మోర్చా అగ్రనేత రాకేష్ టికాయత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన , ఆందోళన కార్యక్రమాలకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇదిలా ఉండగా మోదీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేలా చేసిన 2021 రైతుల నిరసనలలో రాకేష్ టికాయత్ జాతీయ స్థాయిలో పేరు పొందారు రాకేష్ టికాయత్. సమాజ్వాదీ పార్టీ, ఆజాద్ సమాజ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ వంటి బీజేపీ వ్యతిరేక రాజకీయ పార్టీల మద్దతు పొందిన తర్వాత,మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న రైతు సంఘాల మద్దతును సీజేపీ కూడగడుతోంది. విద్యార్థుల నిరసనకు మద్దతు ఇచ్చిన రైతు నాయకులకు ధన్యవాదాలు తెలిపేందుకు తాము ఈ సదస్సులో చేరామని సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రాంకా, దీప్కా బలియాన్ తెలిపారు.
విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత సీజేపీ , ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో సర్ ప్రక్రియకు పూర్తిగా తాము వ్యతిరేకమని ప్రకటించారు. దీని వెనుక ఓట్ల కుంభకోణం దాగి ఉందని ఆరోపించారు. ఇదే సమయంలో నేహా బోరా, అభిజిత్ దీప్కే లాంటి నేతలపై కేసులు నమోదు చేయడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పోలీసుల దాష్టీకాన్ని తీవ్రంగా ఖండించారు రైతు అగ్ర నాయకుడు రాకేష్ టికాయత్. బేషరతుగా మోదీ సర్కార్ క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుపట్టారు. ఇదే సమయంలో సర్ పేరుతో దేశ వ్యాప్తంగా 13 కోట్ల ఓట్లను తొలగించేందుకు ప్రధాన కారకుడైన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని టికాయత్ డిమాండ్ చేశారు. విద్యార్థులు చేపట్టే నిరసనలు, ఆందోళన కార్యక్రమాలకు రైతుల పరంగా పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు రైతు అగ్ర నేత.
